అధికారం శాశ్వతం కాదని తెలుసుకోవాలి

  • Publish Date - April 18, 2019 / 10:11 AM IST

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ స్పీకర్, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావుపై వైసీపీ నేత సి.రామచంద్రయ్య తీవ్రంగా మండిపడ్డారు. స్పీకర్‌ పదవి ఔన్నత్యాన్ని కోడెల మంటగలిపారని రామచంద్రయ్య అన్నారు. కోడెల అధికారంపక్షంతో ఒకలా ప్రతిపక్షంతో మరోలా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల తన చరిత్ర ఏంటో తెలుసుకుని మాట్లాడాలి అన్నారు. అధికారం శాశ్వతం కాదనే నిజాన్ని తెలుసుకోవాలని కోడెలకు సూచించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కోడెల కోల్పోయారని అన్నారు. సభలో న్యాయం జరగలేదనే జగన్ ప్రజల్లోకి వెళ్లారని స్పష్టం చేశారు.

కోడెల అసెంబ్లీ జరిపిన తీరు నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలోనే చీకటి అ‍ధ్యాయం అని రామచంద్రయ్య అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కేసిన వ్యక్తి కోడెల అని మండిపడ్డారు. ఎమ్మెల్యే రోజాను ఏకపక్షంగా సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్‌ చేశారని అన్నారు. అసెంబ్లీలో అన్నీ టీడీపీ కార్యక్రమాలుగా మారిపోయాయని, చంద్రబాబును ఎవరితో పోల్చినా వాళ్లను అవమానిచ్చినట్టే అని అన్నారు. దేశ చరిత్రలో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌ లాంటి వారినే ప్రజలు ఓడించారని రామచంద్రయ్య గుర్తు చేశారు. కోడెల రాజకీయంగా అత్యంత వివాదాస్పదమైన వ్యక్తి అని, ఆయన అరాచకాలను రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారని తెలిపారు. స్పీకర్‌ పదవికి కళంకం తెచ్చిన అప్రజాస్వామిక వాది కోడెలని మండిపడ్డారు. కోడెల బెదిరింపులకు ఎవరూ భయపడరని అన్నారు.

కోడెల టీడీపీ ఏజెంట్ లా వ్యవహరించారని రామచంద్రయ్య మండిపడ్డారు. స్పీకర్ పదవిలో ఉన్న విషయాన్ని మర్చిపోయి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని, పచ్చ చొక్కాలు తొడుక్కుని టీడీపీ కార్యకర్తలా తిరిగారని విమర్శించారు. కోడెల దుష్ట సంప్రదాయానికి నాంది పలికారు అని మండిపడ్డారు. పార్టీ, స్పీకర్ పదవికి మధ్య ఒక గీత ఉంటుందని.. దాన్ని కోడెల చెరిపేశారని రామచంద్రయ్య అన్నారు.