చంద్రబాబు ఓటమిని అంగీకరించారు

  • Publish Date - April 11, 2019 / 07:14 AM IST

సీఎం చంద్రబాబు తన ఓటమిని అంగీకరించారని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు అధికారాన్ని కోల్పోతున్నట్టు స్పష్టమవుతోందన్నారు. ఈవీఎంలపై చంద్రబాబు చేసిన కామెంట్లే దీనికి నిదర్శనం అని సుబ్బారెడ్డి చెప్పారు. సైకిల్ కి నొక్కితే ఫ్యాన్ కి ఓట్లు పడుతున్నాయని చంద్రబాబు అంటున్నారంటే.. టీడీపీ ఓడిపోతుందని అర్థం అని సుబ్బారెడ్డి చెప్పారు. వైసీపీ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, టీడీపీకి ఓటు వస్తే వైసీపీకి పడుతోందని చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు ఆరోపణలను వారు ఖండించారు.

ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు సీఎం చంద్రబాబు ఈవీఎంలు పనిచేయడం లేదంటూ దుష్ప్రచారానికి తెరదీయడం దారుణమని వైసీపీ నేత వై.వి.సుబ్బారెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కుటుంబంతో సహా వెళ్లి ఓటు వేశాక ఇటువంటి ప్రచారం ప్రారంభించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ఫ్యామిలీ పచ్చ వస్త్రాలు ధరించి ఓటు హక్కు వినియోగించుకున్నారని, అనుకూల మీడియా సహకారంతో ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. గుత్తిలో జనసేన అభ్యర్థి ఈవీఎం పగులగొడితే అది వైసీపీ చేసినట్లు అనుకూల మీడియా ప్రచారం చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. ఎన్నికల అధికారులు టీడీపీ నేతల ఎత్తుగడను గమనించి తక్షణం స్పందించాలని కోరారు. ఓటమి భయంతో టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని సుబ్బారెడ్డి మండిపడ్డారు. వైసీపీ వార్డు కన్వీనర్‌పై దాడి చేసిన ఏలూరు టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జిని అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో సి.ఎం.రమేష్‌ కూడా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు

చంద్రబాబు ఈవీఎంల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈసీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 30శాతం ఈవీఎంలు పని చెయ్యడం లేదని ఫిర్యాదు చేశారు. ఈవీఎంలు మొరాయించడంతో ప్రజల్లో అసహనం కనిపిస్తోందన్నారు. పోలింగ్ కేంద్రాల వరకు వచ్చిన ఓటర్లు.. ఓటు వేయకుండానే వెనక్కి వెళ్లిపోతున్నారని లేఖలో చెప్పారు. టీడీపీకి ఓటు వేస్తే వైసీపీకి పడుతోందనే ఫిర్యాదులు వస్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు.

టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లో ఈవీఎంలపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని ఈసీకి రాసిన లేఖలో చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలను తాము అంగీకరించబోమని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈవీఎంలు పని చేయకపోవడంతో ఇప్పటికే 3 గంటల సమయం వృథా అయిందని అన్నారు. ఈవీఎంలు పనిచేయని చోట రీపోలింగ్ నిర్వహించాలని చంద్రబాబు ఈసీని డిమాండ్ చేశారు. ఈవీఎంల పనితీరుపై రాష్ట్రమంతా ఫిర్యాదులు వస్తున్నాయని, ఓటర్లు ఆందోళనలో ఉన్నారని చంద్రబాబు చెప్పారు. అన్ని పోలింగ్ బూత్ లలో ఓటర్లు మొత్తం వచ్చి ఓటేసేంత సమయం లేదని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల సంఘం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓటర్లు ఆందోళన చేస్తున్నా అధికారులు ఎవరూ స్పందించడం లేదని చంద్రబాబు సీరియస్ అయ్యారు.