గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు నాణ్యంగా ఉండాలని సీఎం జగన్ అన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని సూచించారు. గురువారం (ఆగస్టు 29, 2019)వ తేదీన సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈమేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలకు సంబంధించి తొమ్మిది రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని, వీటిని మూడు దశల్లో అమలు చేస్తామని తెలిపారు. ఇక అధికారులు క్రమం తప్పకుండా వసతి గృహాల్లో కనీస సౌకర్యాల ఉన్నాయో లేదో పరిశీలిస్తూ, నిరంతరం తనిఖీలు నిర్వహించాలని సూచించారు. గురుకుల పాఠశాలలు, వసతి గృహాళ్లో చేపట్టాల్సిన పనులపై ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టల్స్ పనులపై ప్రణాళికలు తయారు చేయాలన్నారు. మంచాలు, బ్లాంకెట్స్ సహా అన్ని సౌకర్యాలూ హాస్టళ్లలో ఉంచాలన్నారు. డిమాండ్ ఉన్న చోట కొత్త హాస్టళ్ల కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని వెల్లడించారు. 309 హాస్టళ్లలో కుక్స్, వాచ్ మెన్ సహా ఖాళీగా ఉన్న 927 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఏడాది నుంచి స్కూల్ తెరిచే సమయానికి యానిఫారమ్స్, పుస్తకాలు అందాలన్నారు. నామినేటెడ్ పోస్టులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించాలని సూచనలు చేశారు.
సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, పాడేరులో ట్రైబల్ మెడికల్ కాలేజీ, కురుపాంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ, 7 ఐటీడీఏ ప్రాంతాలు(అరుకు, పాలకొండ, పార్వతీపురం, రంపచోడవరం, చింతూరు, కె.ఆర్ పురం, డోర్నాల)లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు ప్రతిపాదనలకు ఆదేశించారు.
రాజకీయాలకు, పార్టీలకతీతంగా అందరికీ ప్రభుత్వ పథకాలు అందాలని, పథకాల అమల్లో పారదర్శకత ఉండాలన్నారు . వచ్చే ఏడాది నుంచి 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు ప్రతి ఏటా రూ. 1870 సంతృప్తికర స్థాయిలో వైఎస్సార్ చేయూతను ఇవ్వనున్నట్లు తెలిపారు. గిరిజనులకు అటవీ భూముల పట్టాలు ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఈ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎస్సీలకు, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయాలని, ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టాలని సూచించారు.