సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకొంటున్న వారికి, మత్స్యకార్మికులకు రూ.10వేల చొప్పున ఇవ్వనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం అమరావతిలో సమీక్ష నిర్వహించారు.
సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకొంటున్న వారికి సెప్టెంబరు చివరి వారంలో రూ.10వేలు ఇవ్వబోతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన(ప్రజా పరిష్కార వేదిక) కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ మంగళవారం (ఆగస్టు 27, 2019)వ తేదీన అమరావతిలో సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఇచ్చే ఏ డబ్బు అయినా పాత అప్పులకు జమ కాకుండా అన్ ఇన్‌కంబర్డ్ బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయించాలని సూచించారు. ఇందుకు సంబంధించి బ్యాంకర్లతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. లబ్ధిదారులను ఎంపిక చేయడమే కాకుండా, ఈ బ్యాంకు ఖాతాలను తెరవడంపై కూడా వాలంటీర్లు దృష్టిపెట్టాలని ఆదేశించారు. డబ్బు జమ కాగానే ఈ రశీదులను లబ్ధిదారులకు అందించాలని సూచించారు.
అదేవిధంగా ఈ బ్యాంకు ఖాతాలను తెరవడానికి కలెక్టర్లు కూడా బ్యాంకర్లతో సమావేశం కావాలని..ఈ విషయంలో ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని సూచించారు. ప్రభుత్వ పథకం నుంచి అందే ఏ డబ్బు అయినా లబ్ధిదారులకే నేరుగా చేరాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేసినట్లు సీఎం జగన్ అన్నారు. వినతుల పరిష్కారంలో నాణ్యత చాలా ముఖ్యమన్నారు జగన్. ఏదైనా వినతిని తిరస్కరించే ముందు సరైన కసరత్తు అవసరం అన్నారు. తిరస్కరిస్తున్న వినతులు కలెక్టర్ల పరిశీలనకు రావాలన్నారు. ప్రజలు ఎక్కువ సేపు లైన్ లో ఉండాల్సి వస్తోందన్నారు. ప్రజలకు రశీదులు ఇవ్వడంలో ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు.
2019, నవంబర్ 21వ తేదీన ప్రపంచ మత్స్యకార్మిక దినోత్సవం సందర్భంగా సముద్రంలో వేటకు పోయే మత్స్యకారులకు సంతృప్తికర స్థాయిలో సహాయం అందజేస్తామని సీఎం జగన్ తెలిపారు. పడవలు, బోట్లు ఉన్న మత్స్యకార్మికులకు రూ.10వేల చొప్పున ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ పథకం తీసుకొచ్చామన్నారు. ఈ సందర్భంగా వేట నిషేధ సమయం జూన్‌లో ముగిసినా డీజిల్ పట్టించేటప్పుడే వారికి సబ్సిడీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇందుకోసం కొన్ని బంకులను ఎంపిక చేసి.. ఈ బంకుల జాబితాను మత్స్యకారులకు ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం లీటర్‌పై రూ.6 లు ఇస్తున్నారని, దీనిని తమ ప్రభుత్వం రూ.9లకు పెంచబోతుందన్నారు. నవంబర్ 21వ తేదీన ఈ పథకం అమలవుతుందని తెలిపారు.