సిక్కోలులో సీఎం జగన్ : కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు శంకుస్థాపన

  • Publish Date - September 6, 2019 / 07:14 AM IST

శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 6, 2019)వ తేదీన పలాసలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 200 పడకల కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం, మంచినీళ్లపేటలో మత్స్యకారుల కోసం నిర్మించే జెట్టీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినందుకు ప్రజలందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. పాదయాత్రలో మీ సమస్యలు విన్నాను.. నేను ఉన్నాను అని చెప్పానని తెలిపారు. పాదయాత్రలో ప్రజలు చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకున్నానని తెలిపారు. 

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి రాగానే కిడ్ని బాధితులకు రూ. 10 వేల పెన్షన్ ఇస్తూ మొట్టమొదటి సంతకం చేశానని గుర్తు చేశారు సీఎం జగన్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కిడ్నీ బాధితుల కోసం 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశానని తెలిపారు. కిడ్ని బాధితులను గుర్తుపెట్టుకుని ఇంకా వారికి మంచి చేసేందుకు అడుగులు వేస్తున్నామని తెలిపారు. డయాలసిస్ జరుగుతున్న పేషెంట్లకు రూ.10 వేల పెన్షన్ ఇస్తున్నామని సగర్వంగా చెప్పారు. 

స్టేజీ 3 దాటిన కిడ్నీ పేషంట్లకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పెన్షన్ తీసుకుంటున్నవారికి కూడా మేలు జరగాలన్నారు. అందుకుగానూ ప్రతి 500 వందల కిడ్నీ పేషెంట్లకు ఒక హెల్త్ వర్కర్ ఉంటారని తెలిపారు. కిడ్నీ బాధితులకు, అటెండర్ కు ఉచిత బస్ పాస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ల్యాబ్ లో ఉచితంగా టెస్టులు చేస్తారని చెప్పారు. పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లోని 807 గ్రామాలు, రెండు మున్సిపాలిటీలకు నేరుగా ఇంటి దగ్గరకే తాగునీరు అందించేందుకు సర్ పేస్ వాటర్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఇవాళే శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.

Also Read : ప్రతి విద్యార్థికి పూర్తిగా ఫీజురీయింబర్స్ మెంట్