విశాఖ కిడ్నీ రాకెట్ పై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేసినట్లు వెల్లడించారు ఏపీ డీజీపీ ఆర్.పీ ఠాకూర్. నిందితులు ఎంతటివారైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విశాఖ ఫైనాన్షియల్ కాలనీలో నూతన సీఐడీ ప్రాంతీయ కార్యాలయాన్ని శుక్రవారం (మే10, 2019) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ రూ.2.4 కోట్లతో సీఐడీ ప్రాంతీయ కార్యాలయాన్ని నిర్మించామన్నారు.
రాష్ట్రంలో ఇది మూడో ప్రాంతీయ కార్యాలయం అని వివరించారు. మిగిలిన నాలుగు ప్రాంతీయ కార్యాలయాలను త్వరలో ప్రారంభిస్తామన్నారు. పోలీస్ శాఖ నిధులతో సంబంధం లేకుండా సీఐడీ కార్యాలయ నిర్మాణానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని కేసులను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తామన్నారు.