విజయవాడ : ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాష్ట్ర పోలీస్ బలగాలతోపాటు కేంద్ర బలగాలను మోహరించామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. తనిఖీల్లో రూ.3 కోట్లు, పెద్ద ఎత్తున మద్యం స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఎన్నికల నియమావళిని గట్టిగా అమలు చేస్తున్నామని తెలిపారు.
నగదు పంపణీ అవుతుంటే అరికట్టి, కేసులు పెడుతున్నామని తెలిపారు. అనుమతులు లేకుండా వాహనాలను ప్రచారానికి వినియోగించడం, ప్రచార సామాగ్రికి సంబంధించిన బిల్లులు సమర్పించకపోవడం, అనుమతి లేని వాహనాలు నడపడం వంటి వాటికి పాల్పడుతూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విజయవాడ కమిషనరేట్ పరిధిలో పది చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని.. సమర్థవంతంగా పని చేస్తున్నాయన్నారు. వాటి ద్వారా ఇప్పటివరకు రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదికాకుండా జ్యూవెలరీకి సంబంధించిన 60 లక్షలను కూడా సీజ్ చేశామని తెలిపారు. ఎంసీసీ టీమ్స్, ఎలక్షన్ అబ్జర్వర్స్ కు చూపించి వాటని రిలీజ్ చేశామన్నారు.
అలాగే ఎక్సైజ్ కు సంబంధించిన 77 లక్షల విలువ చేసే మధ్యం దొరికిందని చెప్పారు. ఎన్నికలు, ఎక్సైజ్ కు సంబంధించి 244 కేసులు పెట్టడం జరిగిందన్నారు. దీంతో క్రమ శిక్షణ వచ్చిందని భావిస్తున్నామని తెలిపారు. 330 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సైనిక బలగాలను మోహరిస్తామని చెప్పారు.