ఏపీ సీఎంను డిసైడ్ చేసే నియోజకవర్గం ఇదే

  • Publish Date - March 25, 2019 / 05:10 AM IST

ఏలూరు: ఏపీ పాలిటిక్స్ లో గోదావరి జిల్లాలది ప్రత్యేక స్థానం. వారు డిసైడ్ చేసిన పార్టీలే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంటాయి. 2014 ఎన్నికల్లో కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ క్లీన్ స్విప్ చేసింది. గత ఎన్నికల్లో టీడీపీకే (టీడీపీ – బీజేపీ పొత్తు) ఆ జిల్లా వాసులు పట్టం కట్టారు. ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాల్లో ఏలూరు నియోజకవర్గం సెంటిమెంట్ ఎన్నికల వేళ గట్టిగా వినిపిస్తుంది. ఈ నియోజకవర్గంలో ఏ జెండా ఎగిరితే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు జరిగిన ఎన్నికల చరిత్రను చూపిస్తూ సెంటిమెంట్ గురించి గట్టిగా చెబుతున్నారు. ఈ చరిత్ర ఈనాటిది కాదని,1989 నుంచి ఈ సెంటిమెంట్ కొనసాగుతున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు (ప.గో.జిల్లా కేంద్రం) నియోజకవర్గంలో గెలిచిన పార్టీయే.. అధికార పీఠాన్ని చేజిక్కించుకుంటోంది. ఇలా ఒకసారి కాదు..రెండుసార్లు కాదు ఏకంగా 1989-2014 వరకు జరిగింది.  ఈ క్రమంలో ఏలూరు నియోజకవర్గంపై ఆయా పార్టీలు ప్రత్యేక దృష్టిని పెడతున్నాయి.

ప్రస్తుతం ఏలూరు నియోజకవర్గం నుంచి బడేటి కోట రామారావు (బుజ్జి) టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోట రామారావుకే ఈసారి కూడా టీడీపీ టికెట్‌ను ఖరారు చేసింది. దీంతో 2019 ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని బుజ్జి  పట్టుదలతో ఉండగా.. ఏలూరు కార్పొరేషన్‌ కోఆప్షన్‌ మెంబరు షేక్‌ ముజుబర్‌ రెహ్మాన్‌ (పెదబాబు) కొత్తగా రంగంలోకి దిగాలని ప్రయత్నించారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు.

ఇకపోతే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లా అధ్యక్షుడు, ఆళ్ళ కాశీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని) పోటీలో ఉండగా..జనసేన నుంచి రెడ్డి అప్పలనాయుడు బరిలోకి దిగారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. జనసేన పార్టీ కొత్తగా ఎన్నికల బరిలో నిలబడిన కారణంగా టీడీపీ, వైసీపీ పార్టీల ఓట్లకు జనసేన గండి కొడుతుందనే గుబులు రెండు పార్టీ వర్గాల్లోనూ ఉంది. అయితే ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గ ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఏపార్టీకి అధికారం కట్టబెడతారో వేచి చూడాలి.