అమరావతి: జగన్ పై ఉన్న కేసులను మాఫీ చేయించుకోడానికే షర్మిళ రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి అన్నారు. ఇన్నాళ్లూ రాజకీయాలకు దూరంగా ఉన్న షర్మిళ మళ్లీ ఇప్పుడు ఏపీకి వచ్చి ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని అడిగారు. ఏపీలోని ప్రభుత్వ వ్యవస్ధలు అక్కర్లేదు కానీ, ఏపీ ప్రజల ఓట్లు వైసీపీకి కావాలా..? అని దివ్యవాణి ప్రశ్నించారు. రాజధాని, పోలవరం ప్రాజెక్టుల్లో జరుగుతున్న అభివృధ్ది పనులను చూస్తే షర్మిళ కూడా టీడీపీకే ఓటేస్తారు అని ఆమె అన్నారు.
ఏపీపై కేసీఆర్ జులుం ఏమిటీ..? అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబుపై మోహన్ బాబు చేసిన విమర్శలు కేసీఆర్ పధకంలో భాగమేనని ఆమె తెలిపారు.హైదరాబాదులో స్ధిరపడ్డ నటులు చంద్రబాబుకు మద్దతివ్వకున్నా ఫర్వాలేదు కానీ.. విమర్శలు చేయడం కరెక్టు కాదని దివ్యవాణి హితవు పలికారు. ప్రాణ స్నేహితుడైన పవన్ పార్టీలో చేరని ఆలీ వైసీపీలో చేరడానికి కారణమేంటని ఆమె ప్రశ్నించారు. ఆలీ ఆస్తులను లాక్కొంటామని కేసీఆర్ బెదిరించారా..? లేక భారీ ప్యాకేజ్ ఇచ్చారా..? అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.