ఏపీ శాసనమండలి రద్దుకు కేంద్రం ఆమోదం తెలుపుతుందా?

శాసనమండలి రద్దు తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ త్వరలో కేంద్రానికి పంపనుంది. పార్లమెంట్‌ ఆమోదం... రాష్ట్రపతి సంతకం తర్వాత ఏపీ శాసనమండలి రద్దు కానుంది.

  • Publish Date - January 28, 2020 / 03:54 AM IST

శాసనమండలి రద్దు తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ త్వరలో కేంద్రానికి పంపనుంది. పార్లమెంట్‌ ఆమోదం… రాష్ట్రపతి సంతకం తర్వాత ఏపీ శాసనమండలి రద్దు కానుంది.

శాసనమండలి రద్దు తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ త్వరలో కేంద్రానికి పంపనుంది. పార్లమెంట్‌ ఆమోదం… రాష్ట్రపతి సంతకం తర్వాత ఏపీ శాసనమండలి రద్దు కానుంది. మొదటగా రద్దు బిల్లును కేంద్ర హోం శాఖకు పంపుతారు. ఆ తర్వాత పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. పార్లమెంట్‌తో పాటు రాజ్యసభ కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఉభయ సభల నిర్ణయాన్ని బిల్లు రూపంలో రాష్ట్రపతికి పంపుతారు. ఇక్కడ రాష్ట్రపతి నిర్ణయం కీలకం కానుంది. ఆయన కూడా బిల్లుపై సంతకం చేస్తే అప్పుడు శాసనమండలి రద్దు అవుతుంది. అయితే ఈ పక్రియ అంతా అనుకున్నట్లు జరిగితే కనీసం మూడు నెలలు లేదా ఏడాది సమయం పడుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.

మరోవైపు అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఏపీలో బలమైన పార్టీగా ఎదగాలని చూస్తోంది. ఈ క్రమంలో రాజధాని తరలింపు బీజేపీకి మంచి అవకాశం కల్పించింది. రాజధానిని తరలించడాన్ని జనసేన కూడా తీవ్రంగా తప్పుబడుతోంది. ఇప్పుడు ఈ రెండు పార్టీలు సంయుక్తంగా రాజధానిని తరలించడంపై వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చాయి. ఈ తరుణంలో శాసనమండలి రద్దుకు కేంద్రం సమ్మతి తెలుపుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఏపీ శాసన మండలి రద్దు చేస్తూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. మండలిని రద్దు చేస్తూ సోమవారం(జనవరి 27,2020) జగన్ తీర్మానం ప్రవేశ పెట్టారు. మండలి రద్దు తీర్మానంపై స్పీకర్ తమ్మినేని సీతారాం డివిజన్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించారు. మండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా ఉన్న వారు లేచి నిల్చోవాలని స్పీకర్ చెప్పారు. 133 మంది సభ్యులు తీర్మానానికి మద్దతుగా ఓటు వేశారు. వ్యతిరేకంగా కానీ తటస్థంగా కానీ ఒక్క ఓటు కూడా పడలేదు. మెజార్టీ సభ్యులు మద్దతు తెలపడంతో మండలి రద్దు తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపినట్టు స్పీకర్ ప్రకటించారు. 

కాగా, జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం మండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఆర్టికల్ 169-1 ప్రకారం మండలిని రద్దు చేస్తూ సభ తీర్మానం చేసింది. మండలిని రద్దు చేయాలన్న సీఎం జగన్ తీర్మానానికి అనుకూలంగా 133 మంది సభ్యులు ఓటేశారు. మూడింట రెండొంతులకు పైగా మెజార్టీతో సభ ఆమోదం తెలిపడంతో మండలి రద్దు తీర్మానం శాసన సభ ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రకటించారు. అనంతరం సభను నివరవధికంగా వాయిదా వేశారు.