విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడవ రోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ముగ్గురమ్మలగన్న మూలపుటమ్మ కనకదుర్గమ్మ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ మాత
సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది.
ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది.గాయత్రీ ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్రజపం చతుర్వేదం పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. వేదాల నుంచి పురాణాల వరకూ గాయత్రి దేవిని జ్ఞానానికి ప్రతరూపంగా చెబుతూ వచ్చారు. గాయత్రి అమ్మవారిని తల్చుకున్నా, ఆమె మంత్రాన్ని జపించినా కూడా బుద్ధి వికసిస్తుందని భక్తులు నమ్మకం.
అమ్మను ఇలా పూజించండి
గాయత్రి మంత్రంలో కనిపించించే ‘ధియోయోనః ప్రచోదయాత్”కి అర్థమిదే. గాయత్రీ అమ్మవారిని ఎలా పూజించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..హిందువులు తామరపూలని జ్ఞానానికి చిహ్నంగా భావిస్తుంటారు. అందుకే ఆ జ్ఞానాన్ని అందించే గాయత్రీ అమ్మవారికి కూడా తామర పూలంటే చాలా ఇష్టం. గాయత్రీదేవిని పూజలో భక్తితో ఒక్క తామరపూవుని సమర్పించినా అమ్మవారు ఎంతో పరమానందభరితులవుతారు. ఈరోజు గాయత్రీ అమ్మవారిని నారింజ రంగు వస్త్రంతో అలంకరిస్తారు.
వేకువఝామున సూర్యకిరణాలు నారిజం రంగులో ఉంటాయి. సూర్యుడి వెలుగులాగా గాయత్రీదేవి కూడా జ్ఞానాన్ని ప్రసరిస్తుంది కాబట్టి నారింజ రంగు బట్టలతో అమ్మవారిని అలంకరించమని పెద్దలు చెబుతారు.
ఈ రోజు అమ్మవారిని గాయత్రి అష్టోత్తరంతో పూజిస్తే మంచిదని పండితులు చెబుతుంటారు. ఒకవేళ అలా కుదరకపోతే..“ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం భర్గోదేవస్య ధీమహి ధీయో యోనః ప్రచోదయాత్!” అనే మంత్రంతో ఆరాధించాలి. అదీ వీలుకాకుంటే..‘ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః’ అన్న మంత్రంతో పూజించాలి.
పూజ తర్వాత అమ్మవారికి కొబ్బరి అన్నం లేదా పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి. ఏదీ కుదరకపోతే రవ్వకేసరి లేదా భక్తితో సమర్పించిన పంచదార పెట్టినా కూడా అమ్మవారు అనుగ్రహిస్తారు. ఎందుకంటే బిడ్డలు సమర్పించే ప్రసాదాలకంటే అమ్మవారికి చిత్తశుద్దితో చేసే ఆరాధననే ఎక్కువగా ఇష్టపడుతుంది అమ్మ.
గాయత్రీ అమ్మవారిని పూజిస్తే..పేదరికం, ఆకలిలాంటి కష్టాలన్నీ ఇట్టే తీరిపోతాయట. పిల్లలు కావాలనుకునేవారికి సంతానం, బాధల్లో ఉన్నవారికి మనశ్శాంతి లభించి తీరుతుంది. అన్నింటికీ మించి జీవితంలో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనే విచక్షణ ఏర్పడుతుంది. ఎందుకంటే గాయత్రీ అమ్మ అంటే జ్ఞానానికి ప్రతీక కాబట్టి.