తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు: శైలపుత్రిగా దర్శనమిస్తున్న అమ్మవారు

  • Publish Date - September 29, 2019 / 02:07 AM IST

తెలుగు రాష్ట్రాల్లో శరన్నవారాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలోను..ఆలంపూర్ లో కొలువైన శక్తిపీఠం జోగులాంబ దేవస్థానంలోను శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దీంట్లో భాగంగా..శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో రాజేశ్వరీ,ఆలంపూర్ జోగులాంబ అమ్మవార్లు శైలపుత్రిదేవీ అవతారంలో భక్తులకు దర్శినమిస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అమ్మవారి ఆలయాల్లో భక్తులు వేకువఝామునుండే లైన్లలో బారులు తీరి ఉన్నారు. అమ్మవారిని  భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు. 

ఏపీలో దసరా అంటే బెజవాడ మొత్తం  పండుగ వాతావరణం నెలకొంటుంది…దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రితో పాటు నగరం మొత్తం విద్యుత్ కాంతులతో విరాజిల్లుతోంది. ఆశ్వయుజ మాసంలో 10 రోజులపాటు జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దుర్గగుడి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గ అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆదివారం (సెప్టెంబర్ 29)న స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.ఉదయం 9 గంటలకు స్నపనాభిషేకం అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతించారు. 10 రోజులు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమిస్తుంది. ఉత్సవాల్లో రెండవ రోజు నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రారంభైన దర్శనం  రాత్రి 11 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఉత్సవాలకు ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.