నిజామాబాద్ లో ఎన్నికల ఏర్పాట్లు స్పీడప్
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లను అధికారులు స్పీడప్ చేశారు.

New Project
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లను అధికారులు స్పీడప్ చేశారు.
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లను అధికారులు స్పీడప్ చేశారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా భారీ సంఖ్యలో బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది. సరికొత్త చరిత్రకు నాంది పలికేలా ఎం-3 ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించబోతోంది. ప్రతిష్టాత్మకంగా మారిన ఇక్కడి ఎన్నికల ఏర్పాట్లను ఇవాళ రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్ పరిశీలించనున్నారు.
నిజామాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ ఎన్నిక చరిత్ర సృష్టించబోతోంది. ఇక్కడ మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. ఈవీఎంల ద్వారానే పోలింగ్ జరపాలని నిర్ణయించిన ఎన్నికల సంఘం… ఇందుకోసం ఎం-3 ఈవీఎంలను ఎంచుకుంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో ఈ తరహా ఈవీఎంలు, వీవీ ప్యాట్లను తరలించేసింది.
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 1788 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్న ఎన్నికల సంఘం.. ఒక్కో బూత్‌లో 12 బ్యాలెట్ యూనిట్లతో పోలింగ్ నిర్వహించనుంది. ఈ బ్యాలెట్ యూనిట్లను V ఆకారంలో ఏర్పాటు చేయనుంది. ఇంతపెద్ద మొత్తంలో బ్యాలెట్ యూనిట్లను వాడటం దేశంలోనే తొలిసారి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఎక్కడా 4 బ్యాలెట్ యూనిట్లకు మించి వినియోగించలేదు. అందుకే.. నిజామాబాద్ ఎన్నికలతో ఎలక్షన్ కమిషన్ కొత్త రికార్డు క్రియేట్ చేయబోతోంది. సరికొత్త చరిత్రకు నాంది పలకబోతోంది.
ఇప్పటికే నిజామాబాద్ అర్బన్, రూరల్, బాల్కొండ నియోజకవర్గాలకు కేటాయించిన ఓటింగ్ యంత్రాలను పరిశీలన చేసిన అధికారులు… మిగతా నియోజకవర్గాల ఈవీఎంల పరిశీలనను రెండ్రోజుల్లో పూర్తిచేయనున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులందరికీ వీటిపై అవగాహన కల్పించిన అధికారులు… లఘుచిత్రాలు, కరపత్రాలు, మోడల్ పోలింగ్ స్టేషన్ల ద్వారా ఓటర్లకు కూడా అవగాహన కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవైపు అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో తలనమునకలవగా… మరోవైపు బరిలో నిలిచిన రైతులు మాత్రం ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు ఇప్పటివరకు అధికారికంగా గుర్తులను కేటాయించలదేని.. తమ ప్రచారానికి సమయం సరిపోదని వారు వాపోతున్నారు.
అయితే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు నిజామాబాద్ కలెక్టర్ రామ్మోహన్‌రావు. పోలింగ్ సమయం పెంచడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా, పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా, శాంతియుతంగా ఎన్నికలను నిర్వహిస్తామని చెబుతున్నారు. ఇక్కడి ఎన్నికల ఏర్పాట్లను ఇవాళ రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్ పరిశీలించనున్నారు. హెలికాప్టర్‌లో నిజామాబాద్ చేరుకోనున్న ఆయన.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో సమావేశం అవుతారు. ఈవీఎంల లైవ్ డెమోతోపాటు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. పోలింగ్ స్టేషన్లను పరిశీలించి.. ఓటర్లతో ముఖాముఖి సమావేశం జరుపుతారు. ఇందుకోసం జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు.