ఏపీ అసెంబ్లీ తీర్మానం : దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించండి

  • Publish Date - February 7, 2019 / 05:07 AM IST

అమరావతి : దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తిస్తూ.. సమాన హోదా కల్పించాలంటూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ ఏసీ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది. సీఎం చంద్రబాబు తీర్మానాన్ని ఫిబ్రవరి 6వ తేదీ బుధవారం ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. ఎమ్మెల్యే యామినీబాల బలపరిచారు. బీజేపీ ఫ్లోర్‌లీడర్ విష్ణుకుమార్‌రాజు సమర్థించారు.

 

తీర్మానంలో పొందు పరిచిన వివరాలు ఇలా :
సమాజంలో తరతరాలు వస్తున్న కులవ్యవస్థ అసమానతలు ఈనాటికి పెరుగుతునే ఉన్నాయి. హిందూ మత విశ్వాసాలను అనుసరిస్తున్న ప్రజలను సామాజిక వర్గాలుగా విడదీసింది ఈ కుటవ్యవస్థ. ఇదే సమాజంలో పలు వర్గాల వివక్షకు కారణమైంది. పుట్టుక నుంచి చావు వరకూ ఈ వివక్ష కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో హోదా, గౌరవం, హక్కులు ఉన్నత వర్గాలవారే అనుభవిస్తున్నారనే వాదన కొనసాగుతోంది. అట్టడుగు వర్గాలవారు హక్కులకు దూరమై వారు ఎంచుకున్న వృత్తుల్లోనూ అపరిశుభ్రంగా భావించే వృత్తులను బలవంతంగా ఎదుర్కోవాల్సి వచ్చిన క్రమంలో అస్పృశ్యత కుల వ్యవస్థలో అంతర్భాగంగా మారిపోయింది. 
 

ఆర్టికల్ 341 ద్వారా సంక్రమించిన అధికారంతో రాష్టపతి రాజ్యాంగ ఉత్తర్వు 1950, 76 సవరణల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 59 కులాలను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చారు. క్రైస్తవ మతంలో చేరిన షెడ్యూల్డ్ కులాల వారికి వీటిని నిరాకరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేయటంతో పాటు క్రైస్తవ మతంలో చేరిన షెడ్యూల్ కులాల వారికి కూడా ఎస్సీ హోదా కల్పించేందుకు అనువుగా రాజ్యాంగ సవరణ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పేదరికమే కులానికి ప్రామాణికమన్నారు. ఏ వర్గంలో ఉన్నవారైనా అస్పృశ్యత, అంటరాని తనానికి గురికారాదని స్పష్టం చేశారు. కేంద్రం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.