ఫొని తుపాను దూసుకొస్తుంది. అతి తీవ్ర తుపానుగా మారిన ఫొని.. ప్రస్తుతం పూరీకి 610 కిమీ, మచిలీపట్నం తీరానికి 360 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. ఫొని తుపాను కారణంగా బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి 10 అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. 120 కిమీ వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. మే 3న మధ్యాహ్నం సమయానికి ఒడిశా తీరంలోని పూరి, పారాదీప్ దగ్గర ఫొని తుపాను తీరం తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తీరాన్ని దాటే సమయంలో గంటకు 170 నుంచి 180 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. తీరం దాటాక 24 గంటల పాటు తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. ఒడిశాతో పాటు వెస్ట్ బెంగాల్, ఏపీలో ఫొని ఎఫెక్ట్ ఉంటుందని ఐఎండీ తెలిపింది.
శ్రీకాకుళం ఉత్తర, తీర ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మే 2, 3వ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. విశాఖ, తూ.గో. జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పలు మండలాల్లో కనిష్టంగా 120 మిమీ, గరిష్టంగా 180 మిమీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
ఫొని తుపానుపై జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సమీక్ష నిర్వహించింది. తుపాను ప్రభావం, సహాయక చర్యలపై చర్చించారు. సహాయక చర్యలకు సిద్ధం చెయ్యాలని కేంద్ర, రాష్ట్ర విభాగాలకు ఆదేశాలు ఇచ్చారు. మే 2వ తేదీ సాయంత్రానికి తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ సిబ్బంది ఇప్పటికే సహాయక చర్యలకు సిద్ధమయ్యారు. ఏపీలో 12, ఒడిశాలో 28, వెస్ట్ బెంగాల్ లో 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అదనంగా 32 బృందాలను రెడీ చేశారు.