ఫొని తుఫాను ప్రభావం ఉత్తరాంధ్రపై స్పష్టంగా కనిపిస్తోంది. విజయనగరం జిల్లాలో భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా అంధకారంలో మగ్గిపోతోంది. సముద్రంలో రాకాసి అలలు ఎగసిపడుతుంటే… చెట్లు జడలు విరబోసుకున్న దయ్యాల్లా ఊగిపోతున్నాయి. దీంతో… ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
సూపర్ సైక్లోన్‌గా మారిన ఫొని తుఫాన్.. ఏపీలోని ఉత్తరాంధ్రపై ప్రభావం చూపిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంపై ఫొని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా… ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. శ్రీకాకుళంలోని అనేక ప్రాంతాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈదురుగాలులు వీస్తుండటంతో.. అనేక మండలాల్లో విద్యుత్ సరఫరా నిల్చిపోయింది. గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిల్చిపోవడంతో.. రాత్రంతా ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న తీర ప్రాంత మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అధికారులు సహాయక, పునరావాస చర్యలు ప్రారంభించారు. తుపాను ప్రభావిత మండలాల్లో సుమారు 126 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసి అవసరమైన ఆహారం అందుబాటులో ఉంచారు. ఉదయం నుంచి 23 మండలాల్లో గాలులు, వర్షంతో తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.
తుఫాన్ కారణంగా ఉత్తర శ్రీకాకుళంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈదురు గాలులు, కుండపోత వర్షం పడే అవకాశం ఉండటంతో.. జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. జిల్లాలో 21 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అటు భీమునిపట్నం, కళింగపట్నం ఓడరేవుల్లో 10వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీచేసిన అధికారులు.. విశాఖ, గంగవరం పోర్టుల్లో 8వ నంబర్ హెచ్చరికను, కాకినాడ రేవులో 5వ నంబర్ హెచ్చరికను, మిగిలిన ఓడరేవుల్లో 3వ నంబర్ హెచ్చరికను జారీచేశారు. ప్రస్తుతం తీరప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఒకటిన్నర మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి.
ఫొని తుఫాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో భయానక వాతావరణం నెలకొంది. భారీ ఈదురు గాలులతో విజయనగరం హోరెత్తిపోతోంది. సముద్రం భయానకంగా మారింది. ఏ చెట్లు విరుగుతాయో, ఏ స్ధంభాలు కూలుతాయో అన్నట్లుగా ఫొని తుఫాన్ పడగ విప్పింది. నిన్న సాయంత్రం 6గంటల వరకు తుపాన్ ముందు ప్రశాంతత కనిపించింది. అయితే ఒక్క సారిగా ఈదురు గాలులు ఊర్లు మీద విరుచుకుపడటంతో… జనం బెంబేలెత్తిపోయారు. ముందస్తు చర్యల్లో భాగంగా.. జిల్లాలోని పలుప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గాలులు హోరెత్తిపోతుండటంతో… మరో హుద్ హుద్ భయానక పరిస్థితి కనిపిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం తీర ప్రాంత మండలాల్లో తుఫాన్ కారణంగా అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.