శ్రీకాకుళం : ఫోని తుఫాన్ శ్రీకాకుళం జిల్లాను దాటిందని కలెక్టర్ నివాస్ తెలిపారు. కానీ తుఫాన్ ఒడిశా తీరం దాటినా అనంతరం భారీ వర్షాలు కురుస్తాయని..దీంతో వరదలు వచ్చే అవకాశముంటుందని..కాబట్టి నదీ తీరంలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జె.నివాస్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి రాత్రంతా తుపాను కదలికలను గమనించిన ఆయన.. జిల్లాకు దాదాపు ముప్పు తప్పినట్టేనని ప్రకటించారు.
వర్షపాతం కూడా ఊహించిన విధంగా కురిసిందని తెలిపారు. కంచిలి మండలంలో 19 సెంటీమీటర్లు, ఇచ్చాపురం మండలంలో 140 కిలో మీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయని తెలిపారు. ఇచ్చాపురంలో 3 పక్కా ఇళ్లకు తీవ్ర నష్టం వాటిల్లిందని..దానికి మించి ప్రాణ, ఆస్థి నష్టాలేమీ కాలేదని కలెక్టర్ తెలిపారు. అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థకు ఎటువంటి నష్టం కలగలేదని తెలిపారు. రాకపోకలకు అంతరాయం లేకుండా చూస్తామని నివాస్ తెలిపారు. తుపాను తరువాత వరదలు వచ్చే అవకాశముందని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నివాస్ సూచించారు.