రైతు భరోసాలో అన్యాయం జరిగిందని ఆత్మహత్యాయత్నం

రెవెన్యూ ఉద్యోగుల తీరుని నిరసిస్తూ ఏపీలోని పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం డోకులపాడులో రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.

  • Publish Date - November 6, 2019 / 11:17 AM IST

రెవెన్యూ ఉద్యోగుల తీరుని నిరసిస్తూ ఏపీలోని పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం డోకులపాడులో రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.

తెలంగాణలో తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటన తర్వాత ఏపీలోనూ ఆందోళనలు మొదలయ్యాయి. రెవెన్యూ ఉద్యోగుల తీరుని నిరసిస్తూ ఏపీలోని పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. తెలంగాణ, ఏపీలోని తహసీల్దార్ ఆఫీసుల ఎదుట బాధితులు ఆందోళనకు దిగుతున్నారు.

భూమి రిజిస్ట్రేషన్, పాస్ బుక్కుల విషయంలో తమకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల బాధితులు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం డోకులపాడులో రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. రైతు భరోసాలో అన్యాయం జరిగిందని పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు అల్లు జగన్మోహన్‌ రావు. అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

రామకుప్పం ఎమ్మార్వో కార్యాలయంలో ఐదు రైతు కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములకు ఇతరులకు పాస్‌ బుక్‌లు ఇచ్చారంటూ నిరసన వ్యక్తం చేశారు. న్యాయం జరగకపోతే కార్యాలయంలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. 

కురబలకోట మండలం ఎమ్మార్వో కార్యాలయంలో రైతు బాలకృష్ణ వినూత్న నిరసన తెలిపారు. పాస్‌బుక్ కోసం ఆరు నెలలుగా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కార్యాలయంలో పడకేసి వినూత్న నిరసన తెలిపారు రైతు బాలకృష్ణ.