ఉడకని అన్నం, కూరలు : సంక్షేమ హాస్టల్స్‌లో దారుణాలు

  • Publish Date - January 6, 2019 / 04:00 PM IST

సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌.. పేద పిల్లలకు మెరుగైన విద్యతో పాటు పౌష్టికాహారం ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని అమలు చేసేందుకు సాంఘిక సంక్షేమశాఖకు సెక్రటరీగా ఓ అధికారిని కూడా నియమించింది. కానీ విద్యార్థులకు పౌష్టికాహారం సంగతి పక్కనబెడితే.. ఉడకని అన్నం.. సగం ఉడికిన కూరలు వడ్డిస్తున్నారు. దీంతో రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాలో 92 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్‌ అయింది.
92మందికి ఫుడ్ పాయిజన్:
సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌లో చదువుకు చదువు.. తిండికి తిండి ఉంటుందని.. తమ పిల్లలు భవిష్యత్ బావుంటుందని.. ఆశించి తల్లిదండ్రులు తమ పిల్లలను సంక్షేమ హాస్టల్స్‌లో చేర్పించారు. ప్రభుత్వం కూడా హాస్టల్స్‌కి సన్నబియ్యం సరఫరా చేస్తుంది. పిల్లలకు మంచి భోజనంతో పాటు  మెరుగైన విద్యను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ను నియమించింది. కానీ ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. చేవెళ్ల, చిట్యాల సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌లో విద్యార్థులకు ఫుడ్‌ పాయిజన్‌ అయింది. మొత్తం 92 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
తిన్న వెంటనే కడుపు నొప్పి, వాంతులు:
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ అయింది. 67 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరికి చేవెళ్ల ఆస్పత్రిలో చికిత్సను అందిస్తున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల వెలుగు హాస్టల్‌లోనూ ఫుడ్ పాయిజన్ అయింది. 25మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్‌లో ఉడకని కాలిఫ్లవర్‌.. క్యాబేజీ కర్రీ పెట్టారని.. అందుకే కడుపునొప్పి.. వాంతులు, విరోచనాలతో విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యారని తోటి విద్యార్థులు చెబుతున్నారు.
పర్యవేక్షణ లోపం:
గురుకులాలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకాధికారిని నియమించినా.. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడిందని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చేవెళ్ల, చిట్యాల హాస్టల్స్‌లో కిందిస్థాయి నుంచి పైస్థాయి ఉద్యోగుల వరకు అందరిపై యాక్షన్‌ తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.