రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమండ్ చేస్తూ గొల్లపూడిలో నిరసన చేపట్టిన మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్యాంగపరమైన నిర్ణయాలతో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశామని దాన్ని ఇప్పుడు సీఎం జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం మూడు రాజధానులని ప్రకటించి విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానికిగా ప్రకటించారని ఇదంతా కుట్ర..రైతుల్ని అన్యాయంచేస్తున్నారంటూ సీఎం జగన్ ప్రభుత్వంపై దేవినేని మండిపడ్డారు.
విశాఖలోని భూముల్ని స్వాహా చేయటానికి జగన్ విశాఖను రాజధానిగా ప్రకటించారని ఆరోపించారు. వైసీపీ నేతలంతా ఇప్పటికే విశాఖలో భూములు కొన్నారనీ అందుకే విశాఖను రాజధానిగా చేయటానికి ఉత్తరాంధ్రను దోచుకోవాటానికే ఈ పన్నాగాలని ఆరోపించారు.
కాగా..రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలన్నీ ఆందోళన కారులతో అట్టుడికిపోతున్నాయి. ఈ గ్రామాల్లో 144 సెక్షన్ విధించటంపై గ్రామస్థులు మండిపడుతున్నారు. ఏదో హత్యలు జరిగినట్లుగా 144 సెక్షన్ పెట్టటమేంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆందోళన చేస్తున్న రైతులను..మహిళలను పోలీసులు అడ్డుకుంటున్నారు. రైతుల్ని అరెస్ట్ చేసి జైళ్లకు తరలిస్తున్నారు. సీఎం జగన్ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సమావేశం అనంతరం రాజధానికి అమరావతిలోనే కొనసాగిస్తామని ప్రకటించాలని వేరే ఏ నిర్ణయం తీసుకోవద్దని రైతులంతా డిమాండ్ చేస్తున్నారు.