భద్రాద్రి కొత్తగూడెం : రెండు బెల్ట్ షాప్స్ మధ్యలో తలెత్తిన వివాదం ఘర్షణలకు దారి తీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గాంధీ బొమ్మ సెంటర్ లో తలెత్తిన ఈ వివాదం ఉద్రిక్తలకు దారి తీసింది. ఈ ఘటనలో చల్లా ప్రతాప్ రెడ్డి మృతి చెందాడు. ప్రతాప్ రెడ్డి మృతి చెందటంతో బంధువులు ఉపేందర్ బెల్డ్ షాపుపై దాడికి పాల్పడ్డారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టేందుకు యత్నించటంతో ప్రతాప్ బంధువులు పోలీసులను కూడా తోసివేశారు.
ఈ రెండు బెల్ట్ షాపులకు చెందిన కుటుంబాల మధ్య శతృత్వం షాపుల వరకు వెళ్లింది. ఈ వ్యవహారం గ్రామానికే తలనొప్పిలా తయారయ్యింది. ఈ క్రమంలో జనవరి 7వ తేదీ రాత్రి రెండు షాపులకు చెందిన వ్యక్తులు.. పీకలదాకా మందుకొట్టి గొడవకి దిగారు. మద్యం మత్తులో మొదలైన గొడవ.. చిలికి చిలికి గాలివానగా మారింది. మాటలు కాస్తా.. చేతల వరకు వచ్చాయి. రెండు వర్గాలకు చెందిన వారు మందుసీసాలు, కర్రలు, రాళ్లతో దాడులకు దిగారు. దాడిలో చల్లా ప్రతాప్ అనే వ్యక్తి గాయపడ్డాడు.ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రతాప్ చనిపోయాడు. దీంతో ప్రతాప్ బంధువులు ప్రత్యర్థి బెల్ట్ షాప్ పై దాడికి దిగారు. మెయిన్ సెంటర్ లోని గాంధీ బొమ్మ దగ్గర సినిమా సీన్ తలపించింది.