కచ్చులూరు పడవ ప్రమాదంపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్‌కు బోటు వెలికి తీసే బాధ్యతలు అప్పగించింది. బోటు వెలికి
కచ్చులూరు పడవ ప్రమాదంపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్‌కు బోటు వెలికి తీసే బాధ్యతలు అప్పగించింది. బోటు వెలికి తీసేందుకు 22 లక్షల 70 వేల రూపాయలు ఖర్చువుతుందని మెరైన్ సంస్థ అంచనాకు వచ్చింది. సెర్చ్ ఆపరేషన్‌లో ధర్మాడి సత్యం పాల్గొననున్నారు. సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొనే వారందరికి రిస్క్ కవరేజ్ ఇచ్చింది ప్రభుత్వం. పూర్తి భద్రతా చర్యలు చేపట్టింది. బోటు ప్రమాదంలో ఇప్పటివరకు 36 మృతదేహాలు వెలికితీశారు. ఇంకా 15 మంది పర్యాటకుల ఆచూకీ తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
ఆదివారం(సెప్టెంబర్ 28,2019) నుంచి ధర్మాడి సత్యం ఆధ్వర్యంలో బోటు వెలికితీత పనులు ప్రారంభించనున్నారు. బోటు వెలికితీతకు అవసరమైన సామాగ్రిని బాలాజీ మెరైన్స్ తరలిస్తోంది. భారీ యాంకర్లతో గాలం వేసి బోటుని ఒడ్డుకు లాగే యోచనలో ఉన్నారు.
మరోవైపు కొంత మంది స్థానికులు సైతం బోటును బయటకు తాము తీసుకు రాగలమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బోటును తీసే సామర్థ్యం ఉన్నవారు వారి ప్రతిపాదనతో ముందుకు వస్తే పరిశీలిస్తామని ప్రభుత్వం చెబుతోంది. బోటును వెలికితీసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.
సెప్టెంబర్ 15, 2019 తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర గోదావరి నదిలో రాయల్ వశిష్ట పర్యాటక బోటు ప్రమాదానికి గురైంది. బోటులో మొత్తం 77 మంది ఉన్నారు. 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. 51 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు 36 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా 15 మంది జాడ తెలియాల్సి ఉంది. తమ వారి జాడ ఎప్పుడు తెలుస్తుందోనని బాధితులు ఆవేదన చెందుతున్నారు. గల్లంతైన వారి కోసం వారి బంధువులు ప్రతిరోజూ ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకూ 36 మంది మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు.
రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగు గుర్తు తెలియని మృతదేహాలు ఉన్నాయి. గుర్తు పట్టడానికి వీలు లేని పరిస్థితిలో ఉన్నాయి. ఇంకా ఆచూకీ తెలియని వారి కుటుంబసభ్యుల నుంచి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. డీఎన్‌ఏలు ఆధారంగా మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆచూకీ తెలియని వారి డెత్ సర్టిఫికెట్లను కుటుంబసభ్యులు అడుగుతున్నందున దానిని పరిశీలించి జీవో తెచ్చే ప్రయత్నం చేస్తామన్నారు.