గొల్లపూడి మారుతీరావు. పరిచయం అవసరం లేని పేరు. గొల్లపూడి మారుతీరావు నడిచే గ్రంథాలయంల. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయనలో ఉన్న ప్రతిభ అన్ని రంగాల్లోను ప్రతిఫలించింది. ఎంతోమంది రచనలు చేస్తారు. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి ఉంటుంది. గొల్లపూడి మారుతీరావు కథ అందని ఆకాశంలాగా ఆయన ప్రతిభ నిజంగా ఎవ్వరికి అందనిది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
’అందని ఆకాశం’ జుజుమురా, ఆదిశేషయ్య, దేవుడు మేలు చేయగానే, మా పెద్దనానన కుక్క, ధర్మరాజు, బ్రతకనేర్చిన మనిషి.. ఇక నాటకాల విషయానికి వస్తే ఆయన రచనల ప్రస్థానం అలా ప్రవాహంలా సాగిపోతుంది. గొల్లపూడి మారుతీరావుది విలక్షణమైన శైలి. మనిషి మాటా.. ఆహార్యం, మాట తీరు ఇలా అన్నీ ప్రత్యేకతలే.
ఆయన ఒక్క మాట మాట్లాడితే..ఆ మాట విరుపులో ఎన్నో అర్థాలుంటాయి. అవి అర్థం చేసుకోవటానికి కాస్త బుర్ర ఉండాల్సిందేననిపిస్తుంది. నటుడిగా.. రచయితగా.. ప్రయోక్త… కాలమిస్టు.. సంపాదకుడు, వక్త, వ్యాఖ్యత, విశ్లేషకుడిగా.. ఇలా ఆయనలోని భిన్న కోణాలు.. విభిన్న ప్రతిభలు తెలుసుకోవాలంటే ఓ రోజు సరిపోదు. ఆయనలోని రచయిత.. విశ్లేషణల గురించి రాయాలంటే ఓ పుస్తకం సరిపోదు.
గొల్లపూడిని కదిపితే ఓ సముద్రమంత అనుభావాల అల్లికలు కనిపిస్తాయి. ఆ అల్లికలను మనం అర్థం చేసుకుంటే జీవితంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లకు సమాధానాలు దొరుకుతాయి. అది గొల్లపూడి మారుతీరావులోని విశిష్టత..విశేషం. మరి అంత గొప్ప మేధావి గొల్లపూడి మారుతీరావు అంటే ‘అందని ఆకాశమే’. ఆ అందని ఆకాశం..భౌతికంగా మనకు దూరమైనా…ఆయన రచనల్లోని ప్రతీ అక్షరంలోను మనకు అందుబాటులోనే ఉంటుంది.