ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు శుభవార్త వినిపించింది. వేట నిషేధం పరిహారం పెంచింది. రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో
ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు శుభవార్త వినిపించింది. వేట నిషేధం పరిహారం పెంచింది. రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో మత్స్యకార భరోసాను విస్తరించింది. రైతు భరోసా, వాహన మిత్ర పొందేవారు కూడా మత్స్యకార భరోసా పథకానికి అర్హులే అని తెలిపింది. సంక్షేమ పథకాల పెన్షన్ ఉన్నా మత్స్యకార భరోసాకు అర్హులే అని ప్రభుత్వం తెలిపింది.
నవంబర్ 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం. ఈ సందర్భంగా సీఎం జగన్ మత్స్యకారులకు వైఎస్సార్ భరోసా పేరిట ఆర్థిక సహాయం అందించనున్నారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు 2 నెలలు చేపల వేటకు నిషేధం విధించడంతో.. ఆ రెండు నెలలకు గాను రూ.10వేలు ఆర్థిక సాయం అందించనున్నారు. ఆర్థిక సాయంతో పాటు డీజిల్‌పై సబ్సిడీలు, కొత్త బోట్లకు రిజిస్ట్రేషన్లు వేగంగా జరిగేందుకు చర్యలు తీసుకోనున్నారు.
అలాగే ఫైబర్ బోట్లు, మెకనైజ్డ్ బోట్లు తదితర బోట్లన్నింటికీ నిబంధనలు లేకుండా ప్రభుత్వ పథకాలు త్వరగా అమలయ్యేలా చేయనున్నారు. మత్స్యకారులను ఆదుకుంటామని ఎన్నికల సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటి అమలుకు కృషి చేస్తున్నారు.
నవంబర్ 21న మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి మత్స్య దినోత్సవంలో మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. వేట నిషేధం సమయంలో పరిహారం పొందే లబ్దిదారుల వివరాలు, డీజిలక రాయితీ అమలుపై అధికారులు జాబితా సిద్ధం చేశారు.