శ్రీవారి భక్తులకు శుభవార్త : రూ.10వేలకు వీఐపీ బ్రేక్ దర్శనం

  • Publish Date - October 21, 2019 / 02:38 PM IST

శ్రీవారి భక్తులకు శుభవార్త. ఇక సామాన్య భక్తులు కూడా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. సిఫార్సు లేఖల అవసరమే లేదు. కేవలం రూ.10వేలు విరాళంగా ఇస్తే సరిపోతుంది. ఈ మేరకు టీటీడీ కొత్త స్కీమ్ ప్రారంభించింది. అదే శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ్(శ్రీవాణి) ట్రస్ట్.

శ్రీవారిని కులశేఖరపడి కావలి వరకు వీవీఐపీలు దర్శించుకునే తీరులోనే సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దర్శనానికి భక్తులు రూ.10వేలు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ్(శ్రీవాణి ట్రస్ట్) పేరుతో పథకాన్ని సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్టు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవాణి పథకానికి రూ.10వేలు విరాళంగా ఇస్తే వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ ఇస్తామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి గోకులం ఆఫీస్ లో స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

నవంబర్ 1 నుంచి శ్రీవాణి ట్రస్ట్ స్కీమ్ అమల్లోకి రానుంది. ఫస్ట్ వీక్ లో శ్రీవాణి ట్రస్ట్ పథకానికి సంబంధించిన యాప్ ను అందుబాటులోకి తెస్తామన్నారు. మొదటి 15 రోజులు తిరుమలలో కరెంట్ బుకింగ్ విధానంలో టిక్కెట్లను అందించనున్నట్టు చెప్పారు. ఈ ట్రస్ట్ కు వచ్చిన విరాళాలతో ఆలయాల పరిరక్షణ, నిర్మాణాలకు వినియోగిస్తామన్నారు. విరాళాలు ఇచ్చిన భక్తుడికి ప్రోటోకాల్ పరిధిలో పరిగణిస్తూ దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. విరాళంగా రూ.10వేలు చెల్లించడంతో పాటు టికెట్ ను రూ.500తో కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఆలయ వర్గాలు తెలిపాయి. ఒక నెల ముందుగానే కోటాను విడుదల చేస్తామని టీటీడీ చెప్పింది. ట్రస్ట్ కి డొనేషన్ల రూపంలో వచ్చిన మొత్తాన్ని రాష్ట్రంలో వేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణానికి, అభివృద్ధికి ఉపయోగిస్తామని అధికారులు తెలిపారు.

గతంలో సామాన్య భక్తులు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవాలంటే ప్రజాప్రతినిధులు, ప్రముఖుల నుంచి సిఫార్సు లేఖలు తీసుకురావాల్సి వచ్చేది. సిఫార్సు లేఖలు తీసుకురావడం అందరికీ వీలే కాదు. వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవాలని కోరిక ఉన్నా.. సాధ్యమయ్యేది కాదు. ప్రభుత్వం మారాక కొత్తగా ఏర్పాటైన టీటీడీ పాలకమండలి.. భక్తులకు పెద్ద పీట వేసింది. అందరికి శ్రీవారి దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంటున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. దాని స్థానంలో శ్రీవాణి ట్రస్ట్ స్కీమ్ తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా దళారులకు చెక్ చెప్పినట్టు అవుతుందని టీటీడీ అధికారులు అన్నారు.

ట్రెండింగ్ వార్తలు