ఇటీవలే సీఎం జగన్ గ్రామ వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ మధ్యనే వారికి ట్రైనింగ్ ఇచ్చి విధుల్లోకి తీసుకున్నారు. ఇలా విధులు ప్రారంభించారో లేదో అప్పుడే వేటు పడింది.
ఇటీవలే సీఎం జగన్ గ్రామ వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ మధ్యనే వారికి ట్రైనింగ్ ఇచ్చి విధుల్లోకి తీసుకున్నారు. ఇలా విధులు ప్రారంభించారో లేదో అప్పుడే వేటు పడింది. 10మంది గ్రామ వాలంటీర్లపై వేటు పడింది. వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో ఉద్యోగాల నుంచి తొలగించారు. విజయనగరం జిల్లా బలిజిపేట మండలంలో ఈ ఘటన జరిగింది. మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో నియమితులైన వాలంటీర్లలో 10 మందిని తొలగించాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో)కు ప్రతిపాదనలు పంపినట్లు ఎంపీడీవో దేవకుమార్ తెలిపారు.
ఉన్నత విద్య చదువుతున్నవారు, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ కొందరు గ్రామ వాలంటీర్లుగా ఎంపికైనట్లు ఫిర్యాదులు వచ్చాయని దేవకుమార్ చెప్పారు. దీనిపై విచారణ జరిపి ఆయా వాలంటీర్లను అనర్హులుగా గుర్తించామన్నారు. వారిని తొలగించాల్సిందిగా జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణకు నివేదిక పంపినట్లు ఎంపీడీవో వివరించారు. ఆయా స్థానాల్లో ఎవరైనా అర్హులుంటే ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
స్వాతంత్ర్య దినోత్సవం(ఆగస్టు 15) రోజున గ్రామ వాలంటీర్ వ్యవస్థ మొదలైంది. విజయవాడలో సీఎం జగన్ కొత్తగా ఎంపికైన వాలంటీర్లకు ఐడీ కార్డులు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షలమంది వాలంటీర్లను ప్రభుత్వం నియమించింది. ఆగస్టు 15 నుంచి గ్రామాల్లో వాలంటీర్ల సేవలు మొదలయ్యాయి. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే సీఎం జగన్ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. అవినీతికి ఆస్కారం లేని వ్యవస్థను తీసుకురావాలని.. కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా అందరికి ప్రభుత్వ పథకాలు అందించాలనే గొప్ప ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారు. నవరత్నాలు, మేనిఫెస్టోలోని ప్రతి పథకం వాలంటీర్ల ద్వారానే అమలవుతుంది. పథకాలకు అర్హులైన లబ్థిదారుల్ని గుర్తించాల్సిన బాధ్యత వాలంటీర్లదే.