తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావుతోపాటు రిటర్నింగ్ అధికారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారని, బ్యాలెట్ ఓట్లలో రిగ్గింగ్ కు పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ వైసీపీ కో ఆర్డినేటర్ బొంత రాజేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావుతోపాటు రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేశారు.
ఈ క్రమంలో రాపాక వరప్రసాద్ రావుపై వస్తున్న దొంగ ఓట్లు, రిగ్గింగ్ ఆరోపణలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది హైకోర్టు. అలాగే జనసేన ఎమ్మెల్యేకు నోటీసులు పంపించారు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.
రాపాక వరప్రసాద్ రావు కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్నారు. దీంతో 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాపాకు రాజోలు నుంచి ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. ఆ ఎన్నికల్లో రాపాక ఘన విజయం సాధించారు. 2014 ఎన్నికలు, ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన 2019 ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజోలు నుంచి రాపాకకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు కావడం గమనార్హం.