కరీంనగర్‌ జిల్లాలో హైటెన్షన్ : ఆర్టీసీ డ్రైవర్ మృతదేహంతో ఆందోళన

  • Publish Date - November 1, 2019 / 03:54 AM IST

ఆర్టీసీ కార్మికుల ఆందోళనతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రగులుతోంది. ఆర్టీసీ డ్రైవర్ నంగునూరి ఆనంద్ బాబు హార్ట్ అటాక్‌తో మరణించడంతో.. ఆర్టీసీ జేఏసీ నేతలు చలో కరీంనగర్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బంద్‌ పాటిస్తున్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపితేనే నంగునూరి బాబు అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు, ఆర్టీసీ జేఏసీ, రాజకీయ నేతలు స్పష్టం చేశారు.

గురువారం(అక్టోబర్ 31,2019) నుంచి బాబు ఇంటి ఎదుటే అతడి మృతదేహాన్ని ఉంచి నిరసన తెలుపుతున్నారు. రాత్రంతా రాజకీయ జేఏసీ నేతలు జాగారం చేశారు. చర్చలు మొదలు పెట్టాకే అంతిమయాత్రకు కదులుతామని కుటుంబ సభ్యులు, ఎంపీ సంజయ్, మందకృష్ణ మాదిగ, ఆర్టీసీ నేతలు అల్టిమేటం జారీ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. 

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 28వ రోజుకు చేరింది. ఆర్టీసీ ఇన్‌చార్జ్ ఎండీ హాజరుతోపాటు పూర్తి వివరాలు అందించాలని హైకోర్టు ఆదేశించడంతో..ఈసారి లెక్కలను పక్కాగా సమర్పించేందుకు రెడీ అయ్యారు అధికారులు. ఇక రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఆర్టీసీ పరిస్థితి, అప్పులు, ఆదాయం, నష్టాల చిట్టాను తమ తరపున హైకోర్టుకు అందజేసేందుకు నివేదిక సిద్ధం చేసారు జేఏసీ నేతలు ఈ పరిస్థితుల్లో హైకోర్టులో ఇవాళ్టి విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

ఆర్టీసీకి ప్రభుత్వం బకాయి ఉన్న మొత్తం, పాసుల రీయింబర్స్‌మెంట్ సొమ్ము, విభజన తరువాత ఆర్టీసీకి ఇచ్చిన నిధుల వివరాలను కోర్టుకు అఫిడవిట్ రూపంలో అందజేయాలని అదేశించినా.. పూర్తి వివరాలు ఇవ్వకపోవడంతో ఉన్నతాధికారులపై గత విచారణలో ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. దీంతో ఇవాళ ఆర్టీసీ ఇంఛార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పక్కా లెక్కలతో అధికారులు రిపోర్ట్ తయారు చేయగా… కోర్టుకు సమర్పించే అఫిడవిట్‌ను సర్కార్‌ సిద్ధం చేసింది.

ఆర్టీసీకి కేటాయించిన నిధులపై ఇప్పటికే స్పష్టతనిచ్చిన సర్కార్.. ఆర్టీసీ నష్టాలకు తాము బాధ్యులం కాదన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది. ఆర్టీసీ నష్టాలను తాము పూడ్చలేమని.. సంస్థ ఆర్థిక పరిస్థితి బాగుంటే ఆదుకునేవాళ్లమని కోర్టుకు తెలపనుంది.