తహశీల్దార్ ఆఫీస్ లో ఉద్రిక్తత : ఆత్మహత్యాయత్నం చేసిన రైతు కుటుంబం

తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటన తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ, ఏపీలోని తహశీల్దార్

  • Publish Date - November 6, 2019 / 09:57 AM IST

తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటన తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ, ఏపీలోని తహశీల్దార్

తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటన తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ, ఏపీలోని తహశీల్దార్ ఆఫీసుల ముందు బాధితులు ఆందోళనకు దిగుతున్నారు. భూమి రిజిస్ట్రేషన్, పాస్ బుక్కుల విషయంలో తమకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు. కొన్ని చోట్ల బాధితులు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది.

తాజాగా చిత్తూరు జిల్లా రామకుప్పం తహశీల్దార్ కార్యాయలం దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమ భూమిని కబ్జా చేశారని ఓ రైతు కుటుంబం ఆందోళనకు దిగింది. రైతు కుటుంబానికి చెందిన వారు ఆఫీస్ లోనే ఉరి వేసుకునే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. న్యాయం చేయాలని నెలల తరబడి తహశీల్దార్ చుట్టూ తిరిగినా పని జరగడం లేదని వారు ఆరోపించారు.

అధికారుల తీరుకి నిరసనగా తహశీల్దార్ ఆఫీస్ లోనే వారు ఉరి వేసుకునేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన చుట్టు పక్కల వాళ్లు వారిని అడ్డుకున్నారు. ఇప్పటికైనా తమ భూమి తమకు ఇప్పించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

తెలంగాణలో తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటన తర్వాత ఏపీలోనూ ఆందోళనలు మొదలయ్యాయి. రెవెన్యూ ఉద్యోగుల తీరుని నిరసిస్తూ ఏపీలోని పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. రామకుప్పం ఎమ్మార్వో కార్యాలయంలో 5 రైతు కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములకు ఇతరులకు పాస్‌ బుక్‌లు ఇచ్చారంటూ నిరసన వ్యక్తం చేశారు. న్యాయం జరగకపోతే కార్యాలయంలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. 

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎమ్మార్వో కార్యాలయంలో రైతు బాలకృష్ణ వినూత్న నిరసన తెలిపారు. పాస్‌బుక్ కోసం 6నెలలుగా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కార్యాలయంలో పడకేసి వినూత్న నిరసన తెలిపారు రైతు బాలకృష్ణ. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం డోకులపాడులో రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. రైతు భరోసాలో అన్యాయం జరిగిందని పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు అల్లు జగన్మోహన్‌ రావు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.