దీపావళి ఐదు రోజుల పండగ అని ఎంత మందికి తెలుసు!

  • Publish Date - October 25, 2019 / 05:50 AM IST

భారతీయ సంస్కృతికి అద్దంపట్టే పండుగల్లో దీపావళి ఒకటి. చిన్న పెద్దా తేడా లేకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ పండుగను ఐదు రోజులు చేసుకుంటారు. ఉత్తర భారతంలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. మరి ఈ పండుగ విశిష్టత తెలుసుకుందామా…

ఈ పండుగ అంటే దీపాల వరస అని అర్థం. ప్రతి ఇల్లు, వీధి, దేవాలయాలు దీపాలతో విరజిమ్ముతుంటాయి. అశ్వీయుజ బహుళ త్రయోదశి రోజు ప్రారంభమై కార్తీక శుద్ధ విదియతో ముగుస్తుంది. మెుదటి రోజు ధన త్రయోదశి, రెండో రోజు నరక చతుర్దశి, మూడో రోజు దీపావళి, నాలుగో రోజు గోవర్ధన పూజ, ఐదో రోజు అన్నాచెల్లెళ్ల పండుగ.  

మొదటి రోజు : ధన త్రయోదశి
ఇంటిని శుభ్రం చేసి, తోరణాలతో, రంగవల్లికలతో అలంకరిస్తారు. దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలుకుతున్న సమయంలో ఆ పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. ఈ రోజును లక్ష్మీ దేవి పుట్టినరోజు అని చెప్పుకుంటారు. అంతేకాదు సంపదలను ప్రసాదించే కల్పవృక్షం, కామధేనువు, దేవవైద్యుడు ధన్వంతరి జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. బంగారం, వెండి కాకుండా ధన త్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసిన శుభం జరుగుతుందంటారు. అందుకే ఆ రోజున ప్రజలందరు భక్తి శ్రద్ధలతో లక్ష్మీ దేవిని పూజించి,ఆమె అనుగ్రహం పొందుతారు. ఆ రోజున ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృతభాండం అవుతుంది.

రెండో రోజు : నరక చతుర్ధశి :
అశ్వయుజ బహుళ చతుర్ధశిని నరక చతుర్ధిగా జరుపుకుంటారు. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు మహావిష్ణువు చేతిలో వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది. నరకాసురుడు చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామాతో కలిసి  వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్య జరిగిన యుద్ధంలో భూదేవి అంశ అయిన సత్యభామ దేవి నరకాసురుని సంహరింస్తుంది. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు.

మూడో రోజు : దీపావళి 
అశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు. అమావాస్య రోజున చనిపోయిన పితృదేవతలకు తర్పణం విడిచే ఒక ఆచారం ఉంది. ఆ రోజున పురుషులు పెద్దలకి జలతర్పణం విడుస్తారని పురాణ గాథ. మహాలయ అమావాస్య రోజున స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పితృదేవతలు దీపావళి రోజున దీపాల వెలుగులో తిరిగి వెళ్ళిపోతారు. అందుకే పితృదేవతలకు వెలుతురు చూపించడం కోసం ఇంటి బయట దీపాలు వెలిగిస్తారు. నరకాసురుడిని చంపిన మరుసటి రోజైన అమావాస్యను దీపావళిగా జరుపుకుంటారు. ఆ రోజున ఇంటిని దీపాలతో అలంకరింస్తారు. రక రకాల పిండి వంటలను తయారు చేసుకుంటారు. కొత్త బట్టలను ధరించి, టపాసులను కాలుస్తారు.

నాలుగో రోజు : గోవర్ధన పూజ 
ద్వాపరయుగంలో ప్రారంభమైంది. అంతకు ముందు ఈ పూజను ‘ఇంద్రయాగం’ అనేవారు. ఈ రోజున ఇంద్రుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కార్తీకమాస ఆరంభంలో ఈ పూజ వస్తోంది. ఒకానొక రోజున శ్రీకృష్ణుడు వారందరినీ పిలిచి, గోవర్ధన పర్వతాన్ని చూపిస్తూ.. ఈ రోజు నుంచి ఇంద్రుడిని పూజించడం మానేయండి. మనందరికీ పంటలు, మన పశువులకు మేత ఇచ్చేది ఈ గోవర్ధన పర్వతమే. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడికి కోపం వచ్చి గోకులంపై రాళ్ళ వర్షం కురుపిస్తాడు. శ్రీకృష్ణుడు వారందరీని రక్షించటం కోసం గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకుంటాడు. అప్పటికి ఇంద్రుడి గర్వం నశించి, అతనే స్వయంగా శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చి క్షమించమని అడుగుతాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు ఇంద్రుని  క్షమిస్తాడు. నాటి నుంచి ‘ఇంద్రయాగం’ కాస్త ‘గోవర్ధనపూజ’గా మారిపోయింది. ఆ రోజున కార్తీక శుద్ధ పాడ్యమి కావటంతో రైతులు గోవర్ధన పూజ చేస్తారు.

ఐదో రోజు : అన్నాచెల్లెళ్ల పండుగ (భగినీ హస్త భోజనం)
ఈ రోజును యమ ద్వితీయ, భాయిదూజ్‌గా జరుపుకుంటారు. భగినీ అంటే సోదరి. ఆమె పెట్టే భోజనం భగినీ హస్త భోజనం అంటారు. అన్నా లేదా తమ్ముడు తన సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయి అని నమ్మకం. సూర్యభగవానుడి కుమారుడు యముడు, అతడి సోదరి యమున. ఆమె తన సోదరుని కార్తీక శుక్ల విదియరోజున తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది. దాంతో యముడు నన్నెవరూ ఇంటికి పిలవరు. అయినా నా తోబుట్టువైన ఆడపడుచు స్వయంగా ఆహ్వానించింది. వెళ్లితీరాలి అని నిర్ణయించుకుని వెళ్లాడు. అలా వచ్చిన సోదరుణ్ని చూసి సంతోషించి, అతనికి అభ్యంగనస్నానం చేయించి, తిలకం దిద్ది, స్వయంగా వండిన పదార్థాలను ప్రేమతో వడ్డించింది. సంతోషంతో యముడు ఆమెను వరం కోరుకోమన్నాడు. ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించాలని కోరింది యమున. అప్పటి నుంచి సోదరీ, సోదరుల అప్యాయతకు అనుబంధంగా ఈ పండుగను జరుపుకుంటారు.