బోధన్ : రంగుల కేళీ హోలీ పండుగ అంటు అందరు రంగులు జల్లుకుంటారు. ఈ హోలీ పండుగ ఆయా ప్రాంతాల ఆచారాలను బట్టి జరుపుకుంటారు. ఒరిస్సాలోని జగన్నాథ, పూరీ ఆలయాలలో రాధా, కృష్ణుడు, విగ్రహాలకు ప్రత్యేక పూజలు జరిపించిన తరువాత హోళీ వేడుకలు ప్రారంభిస్తారు.
గుజరాత్ లో అందరూ ఓ చోట గుమిగూడి.. మంటలు వేసి.. పాత చెక్క సామానులన్నీ మంటల్లో వేసి.. మంటల చుట్టూ చేరి నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ ఆనందిస్తారు. మహారాష్ట్రంలో హోళిక దిష్టిబొమ్మను తగుల బెట్టి వేడుక చేసుకుంటారు. ఇక మణిపూర్ లో వారంరోజుల పాటు జరిగే వేడుకల్లో మగపిల్లలు ఆడపిల్లకు డబ్బులిస్తేనే వారిపై రంగులు చల్లుతారు. కానీ వీటన్నింటికి భిన్నమైనది తెలంగాణ నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్స లోని హోలీ పండుగ.
హున్స ఊర్లోని మగవారంతా పిడికిళ్లతో గుద్దుకుంటారు. దాన్నే ‘పిడిగుద్దులాట’ అంటారు. ఇలా ఏదో సరదాగా కాదండోయ్.. రక్తాలు వచ్చేలా గుద్దుకుంటారు. అయినా సరే ఆ ఆటను ఎంజాయ్ చేస్తారు. ఇలా హోలీ పండగ రోజు ‘రంగుపడుద్దీ’ అంటూ వినూత్న ఆచారం చాలా కాలం నుంచి కొనసాగుతోంది. కానీ గతంలో ఓసారి ఈ పిడిగుద్దులాటను చేయలేదట.. ఆ ఏడాది ఊర్లోని ట్యాంకు కూలిపోయిదట. పిడిగుద్దులాటను జరపకపోవడం వల్లే ఈ అనర్థం జరిగిందని స్థానికులు నమ్ముతారు. అందుకే ఈ ‘పిడిగుద్దు’ లాటను కొనసాగిస్తున్నామని అంటున్నారు.
హోలీ పండుగరోజు సాయంత్రం గ్రామంలోని ప్రధాన కూడలిలో పురుషులు పిడికిళ్లను బిగించి ఒకరిపై ఒకరు అరగంట పాటు ఈ ఆటను ఆడుకుంటారు. తర్వాత అందుకూ ఒకరికి ఒకరు అలయ్‌బలయ్ చేసుకుంటారు. ఈ పిడిగుద్దుల్లో గాయపడిన వారు కామ దహన బూడిదను గాయాలకు పూసుకుంటారు. ఇలా చేస్తే.. మొండి గాయాలైనా మానిపోతాయని నమ్మకం. కాగా గ్రామస్థుల సమ్మతితోనే ప్రతి ఏటా ఈ ఆటను జరుపుతున్నామని గ్రామాధికారులు తెలిపారు.