ఓట్లు మహిళలవి..సీట్లు మాత్రం పురుషులకే 

  • Publish Date - April 8, 2019 / 04:49 AM IST

అమరావతి : మహిళా సాధికారత అంటే గప్పాలు కొట్టే నాయకులు ఎన్నికల్లో సీట్లు ఇచ్చే విషయంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను పాటిస్తున్నాయా అంటే లేదనే చెప్పాలి. ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఓటు బ్యాంకులుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నాయి. మహిళా రిజర్వేషన్ కోసం పాటు పడుతున్నామంటు ఎన్నికల్లో మహిళలకు సీట్లు కేటాయించే విషయంలో మాత్రం వారికి ప్రతీ ఎన్నికల్లోను మొండిచేయ్యి చూపుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో ఉండే పలు ప్రధాన పార్టీలలో మహిళలకు ఎవరు ఎన్ని సీట్లు కేటాయించాయో చూద్దాం..

టీడీపీ 20 మంది..వైసీపీ, జనసేన 15 సీట్లు మహిళలకు 
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ఎక్కువగా  టీడీపీ మహిళలకు 20 టికెట్లు కేటాయించింది. వైసీపీ, జనసేన, కాంగ్రెస్‌ 15 చొప్పున కేటాయించగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఏపీలో 6 సీట్లు మాత్రమే ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలకు గాను మొత్తం పార్టీల నుంచి 71 మంది మహిళలు మాత్రమే బరిలో ఉన్నారు. 
 
తూర్పుగోదావరి, కర్నూలు, విజయనగరం జిల్లాల్లోనూ ముగ్గురు చొప్పున అవకాశం పొందారు. శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో రెండేసి టికెట్లు ఇచ్చారు. జగన్‌ తన సొంత జిల్లా కడపలో మహిళలకు ఒక్క సీటూ కేటాయించకపోవటం గమనించాల్సిన విషయం.  175 స్థానాల్లోనూ పోటీ చేస్తున్న వైసీపీ, 8 జిల్లాల్లో 15 మంది మహిళలకు మాత్రమే సీట్లు ఇచ్చింది. కడప, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క మహిళకు కూడా సీటు ఇవ్వలేదు.
 
కమ్యూనిస్టుల పోటీలో మహిళలే లేరు 
రాష్ట్రంలో  జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న కమ్యూనిస్టులు ఒక్క మహిళకు సీట్ ఇవ్వలేదు. కానీ 120 స్థానాల్లో పోటీచేస్తున్న జనసేన..15 సీట్లు మహిళలకు  కేటాయించింది. కృష్ణా, ప్రకాశం,నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో జనసేన తరపున ఒక్కమహిళలకు అవకాశం ఇవ్వలేదు.
ఈ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకంటుందనే వార్తలు వచ్చిన క్రమంలో సొంతగా బరిలోకి దిగిన కాంగ్రెస్‌ కూడా 15 సీట్లు కేటాయించింది. నెల్లూరు, విజయనగరం జిల్లాలు మినహా మిగిలిన 11 జి ల్లాల నుంచి కాంగ్రెస్‌ మహిళలను బరిలో నిలిపింది. బీజేపీ ఆరుగురికి మాత్రమే టికెట్లిచ్చింది. చిత్తూరు, కడప,కర్నూలు, ప్రకాశం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి అవకాశమే ఇవ్వలేదు.
 

రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,93,45,717 మంది. వీరిలో మహిళలు 1,98,79,421, పురుష ఓటర్లు 1,94,62,339. అంటే పురుషుల కంటే 4,17,082 మంది మహిళలు అధికంగా ఉన్నారు. అయినా ప్రధాన పార్టీలన్నీ కలిపి 71 మంది మహిళలకు మాత్రమే ఎన్నికల్లో అవకాశమిచ్చాయి. ఎన్నికల్లో మహిళల ఓట్లే నేతలను డిసైడ్ చేసే సంఖ్యంలో ఉన్నా..వారికి మాత్రం సీట్లు దక్కటంలేదు. కానీ రాష్ట్రంలో 3,957 ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లకు మంగళగిరి నుంచి సింహాద్రి తమన్నా అనే ట్రాన్స్‌జెండర్‌ మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు.