ఐపీఎల్ అంటేనే డబ్బు.. క్షణాల్లో సొమ్ములు దండుకోవాలనే ఆత్రంలో ఎన్ని అడ్డదారులైన తొక్కుతారు. ఇప్పటికే సీజన్ మొదలై 10 రోజులు కావొస్తున్నతరుణంలో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కోచ్ తుషార్ అరెస్టు అయ్యాడు. వడోదరలోని ఓ కేఫ్‌లో బెట్టింగ్‌కి పాల్పడుతున్నారని సమాచారం అందడంతో సోమవారం రాత్రి దాడులు నిర్వహించిన పోలీసులు.. 19 మందిని అరెస్ట్ చేశారు.
కేఫ్‌పై దాడి చేసి పరిసరాల్లో బెట్టింగ్ పాల్పడుతున్నట్లు గుర్తించామని క్రైమ్ బ్రాంచ్ డీసీపీ జడేజా తెలిపారు. నిందితుల మొబైల్ ఫోన్స్ ఆధారంగా మరో 19 మంది బెట్టింగ్ నిర్వాహకుల సమాచారం కూడా తెలిసినట్లు వివరించారు. మాజీ కోచ్ తుషార్ కూడా అక్కడే ఉండడంతో అరెస్ట్ చేసి ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేసినట్లు వెల్లడించారు.
బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న స్థలంలో నుంచి 82 సెల్ ఫోన్లు, రూ.54వేల డబ్బు, 4 టీవీలు, 6 ల్యాప్‌టాప్‌లు, వైఫై డాంగిల్, హార్డ్ డిస్క్‌తో పాటు క్యాలిక్యులేటర్లు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గతంలోనూ జైపూర్‌లో 15 మందితో కూడిన బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
తుషార్ ఆర్ధో 2017లో భారత మహిళల జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. బెట్టింగ్ ఆరోపణలపై మాజీ కోచ్ తుషార్ స్పందించారు. ‘కేవలం 20 నిమిషాల ముందే ఆ కేఫ్‌లోకి వెళ్లాను. ఎలాంటి బెట్టింగ్‌కి పాల్పడలేదు. స్వయంగా నా ఫోన్‌ని పరిశీలించిన పోలీసులు ఎలాంటి బెట్టింగ్ యాప్‌ని గుర్తించలేదు’ అని తెలిపాడు.