జగన్ భల్లాలదేవుడు.. మోడీ బిజ్జలదేవుడు : చంద్రబాబు కౌంటర్

  • Publish Date - April 1, 2019 / 04:27 PM IST

చిత్తూరు : తనను భల్లాలదేవుడితో పోల్చిన ప్రధాని మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ ని భల్లాలదేవుడిగా, మోడీని బిజ్జలదేవుడిగా అభివర్ణిచారు. ఏపీ ప్రజలే బాహుబలి అని అన్నారు. ”ఆంధ్ర ప్రజలు బాహుబలి అయితే జగన్ భల్లాలదేవుడు. ఈ విలన్ కు తండ్రి కుట్రలు, కుతంత్రాలు చేసే బిజ్జలదేవుడు నరేంద్ర మోడీ. ఈ భల్లాలదేవుడు, బిజ్జలదేవుడు మనల్ని ఏమీ చేయలేరు. నాదే విజయం. ఈ ఎన్నికల యుద్ధంలో 25కి 25 సీట్లు గెలిచి చూపిస్తాం” అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేవారు. తన సొంత జిల్లా చిత్తూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేశారు. చిత్తూరు టౌన్ లో ప్రధాని మోడీ, వైసీపీ చీఫ్ జగన్ లపై విరుచుకుపడ్డారు. మోడీ ఏపీ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. జగన్ తన ఆస్తుల కోసం కేసీఆర్ తో కుమ్మక్కయ్యారని, కేసీఆర్ కాళ్ల దగ్గర రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.    

రాష్ట్ర విభజన తర్వాత డబ్బు లేకపోయినా ప్రజలు ఆనందంగా, సంతృప్తికరంగా ఉన్నారంటే దానికి తన పాలనే కారణం అని చంద్రబాబు అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే ప్రతి ఊళ్లో దళారీ వ్యవస్థ తీసుకొస్తాడని ఆరోపించారు. తాను పసుపు-కుంకుమ చెక్కులు ఇస్తే అవి చెల్లవని కోడికత్తి పార్టీ చెబుతోందని మండిపడ్డారు. నా చెక్కులు భేషుగ్గా చెల్లుతాయి కానీ, మీ నెత్తిన రూపాయి పెడితే పావలాకు దిక్కులేదు, మీరే చెల్లని కాసులు అంటూ సెటైర్ వేశారు.

జగన్ కరడుగట్టిన ఫ్యాక్షన్ లీడర్ అని, జగన్ గెలిస్తే అది నేరస్తుల గెలుపు అవుతుందని, అంతిమంగా అది కేసీఆర్ గెలుపు అవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. జగన్ తమకు వద్దని పులివెందుల ప్రజలు కూడా చెబుతున్నారని చంద్రబాబు అన్నారు.