గుంటూరు : ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేస్తున్న చంద్రబాబుకు…ఐదేళ్ల పాలనలో ప్రజలు గుర్తుకు రాలేదని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ప్రశ్నించారు. నవరత్నాల ద్వారా రైతులకు చేరువ కావాలన్నామని తెలిపారు. 21 నెలల క్రితం నవరత్నాలను ప్రకటిస్తే చంద్రబాబు కాపీ కొడుతున్నారని తెలిపారు. ఐదేళ్లలో గుర్తురాని పథకాలు ఎన్నికల ముందు గుర్తొస్తున్నాయని.. దొంగ పథకాలు పెట్టారని విమర్శించారు. పొదుపు సంఘాల్లో వడ్డీలేని రుణాలను ఎగ్గొట్టారని చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు పసుపు-కుంకుమ పేరుతో సినిమా చూపిస్తున్నారని, మహిళలకు ముష్టి వేస్తున్నారని మండిపడ్డారు. పిడుగురాళ్లలో ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రసంగించారు.
చంద్రబాబు పాలనలో రౌడీరాజ్యం, మాఫియా రాజ్యం చెలరేగుతోందన్నారు. ఐదేళ్ల పాలనలో మనం చూసింది ఒక్కటే… మోసమన్నారు. చంద్రబాబు పరిపాలన అన్యాయం, అక్రమాలు, అవినీతి, అబద్ధాలతో సాగిందన్నారు. మైనింగ్ వ్యాపారం మాఫియాగా మారిపోయిందన్నారు. మైనింగ్ వ్యాపారం పేరుతో గనులను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. మైనింగ్ మాఫియాలోనూ చంద్రబాబు, లోకేష్ భాగాలు పంచుకున్నారని ఆరోపించారు. చిన్న చిన్న మైనింగ్ చేసుకుంటున్న వాళ్లను బెదిరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్ మాఫియా ఇంకెక్కడైనా ఉందా అని ప్రశ్నించారు.