తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. మంగళవారం(నవంబర్ 12,2019) కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శైవక్షేత్రాలకు భక్తులు
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. మంగళవారం(నవంబర్ 12,2019) కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెల్లవారుజామునే పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాల్లో బారులు తీరారు. శివనామస్మరణతో దేవాలయాలు మార్మోగుతున్నాయి.
వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వెలిగిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పలు ఆలయాల్లో అభిషేకాలు రద్దు చేశారు ఆలయ అధికారులు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వశిష్ట గోదావరి తీరంలో భక్తుల రద్దీ నెలకొంది. వలందర్ ఘాట్, అమరేశ్వర ఘాట్ లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం దుర్గా లక్ష్మణేశ్వరస్వామికి పంచామృతభిషేకం నిర్వహిస్తున్నారు. నరసాపురం కపిలమల్లేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భద్రాచలంలోని గోదావరి నది దగ్గర భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గోదావరిలో కార్తీక దీపాలు వదులుతున్నారు.
పంచారామ క్షేత్రాలైన పాలకొల్లు శ్రీక్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయం, భీమవరం సోమేశ్వరాలయం, పట్టిసీమ వీరభద్రస్వామి ఆలయం, ద్వారకాతిరుమల మల్లికార్జున స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పట్టిసీమ, కొవ్వూరు, నరసాపురంలో గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలోని మట్టపల్లి శివాలయం, మేళ్లచెర్వు స్వయంభూ మల్లికార్జున స్వామి ఆలయం, బూరుగడ్డ శివాలయం, పిల్లలమర్రి శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.