ముఖ్యమంత్రి జగన్ ఏపీలో రాజధాని వికేంద్రీకరణ అంశం ప్రకటించిన తరువాత విశాఖలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. వైజాగ్‌లో భూముల ధరలు అమాంతం పెరిగిపోవడంతో
ముఖ్యమంత్రి జగన్ ఏపీలో రాజధాని వికేంద్రీకరణ అంశం ప్రకటించిన తరువాత విశాఖలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. వైజాగ్‌లో భూముల ధరలు అమాంతం పెరిగిపోవడంతో భూమి యజమానులు తమ భూములను రిజిస్ట్రేషన్ చేసుకొనే పనిలో పడ్డారు. విశాఖ పరిసర ప్రాంత వాసులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు క్యూ కట్టడంతో జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రధానంగా మధురవాడ, ఆనందపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌లకు టోకెన్ విధానం కుడా తీసుకొచ్చారు.
విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన తరువాత భూముల రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఉన్న రియల్టర్ల కన్ను విశాఖ నగరంపై పడింది. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని విశాఖకు తరలిపోవడం పక్కా అని భావిస్తున్న తరుణంలో.. వైసీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి. విశాఖతోపాటు చుట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో పెద్దఎత్తున భూముల అమ్మకాలు, కొనుగోళ్లు సాగుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద రిజిస్ట్రేషన్ల హడావుడి రోజురోజుకూ పెరుగుతోంది. సహజంగానే విశాఖ నగరంలో భూముల కొనుగోళ్లు, అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఐతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ ఉండబోతుండడంతో అది కాస్తా మరింత ఎక్కువైంది.
విశాఖ పరిసర ప్రాంతాలలో భూములపై పెట్టుబడులు పెట్టడానికి, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయడానికి రియల్టర్లు, ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. పూర్తిస్థాయిలో రాజధాని ఏర్పాటైతే ధరలు మరింత పెరుగుతాయనే ఆలోచనతో.. ముందుగానే కొనుగులుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో కొనుగోలు చేసిన స్థలాలను వెంటనే తమ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. 2019తో పోల్చుకుంటే ఈ ఏడాది భూముల ట్రేడింగ్‌లో 12.5 శాతం వృద్ధిరేటు పెరిగిందని ఇప్పటివరకు ఉన్న గణాంకాలు చెబుతున్నాయి.
3 రాజధానుల ప్రకటన తర్వాత విశాఖలోని ముఖ్యమైన ప్రాంతాలైన జగదాంబ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, ద్వారకానగర్, ఎంవీపీకాలనీ, సీతమ్మ ధార, దసపల్లా హిల్స్, డాబా గార్డెన్స్ వంటి ప్రాంతాల్లో గజం ధర లక్షన్నర రూపాయలు పలుకుతోంది. విశాఖ శివారు ప్రాంతాల్లోకూడా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో అధిక ధరలు పలుకుతున్న భవనాలు, భూములు కబ్జాలకు గురికాకుండా యజమానులు తమపేరున రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. దీంతో నగరంలో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలతోపాటు నగరానికి అనుకోని ఉన్న మధురవాడ, ఆనందపురం వంటి ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వినియోగదారులతో కళకళలాడుతున్నాయి .
ఇక మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల హడావిడి పెరగడంతో.. అక్కడ పండగ వాతావరణం నెలకొంది. వినియోగదారుల తాకిడి పెరగడంతో తలుపులు వేసి మరీ అధికారులు తమ కార్యకలాపాలను చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మధురవాడ ప్రాంతం రాజధానిగా ప్రకటించిన ప్రాంతానికి అతి చేరువలో ఉండడంతో రిజిస్ట్రేషన్ల హడావిడి ఎక్కువగా ఉందని అభిప్రాయపడుతున్నారు అధికారులు. దీంతో కార్యాలయానికి వస్తున్నా వినియీగదారుల తాకిడిని నియంత్రించడం కోసం నూతనంగా టోకెన్ వ్యవస్థను ఏర్పాటు చేశామని చెబుతున్నారు.
* వైజాగ్‌లో అమాంతం పెరిగిన భూముల ధరలు
* జనాలతో కిక్కిరిసిపోతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
* మధురవాడ, ఆనందపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో టోకెన్ విధానం
* విశాఖకు 50 కి.మీ.ల పరిధిలో పెద్దఎత్తున భూముల అమ్మకాలు, కొనుగోళ్లు
*సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద రిజిస్ట్రేషన్ల హడావుడి
* ఈ ఏడాది భూముల ట్రేడింగ్‌లో 12.5 శాతం వృద్ధిరేటు
* జగదాంబ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, ద్వారకానగర్, ఎంవీపీకాలనీ, సీతమ్మ ధార..
* దసపల్లా హిల్స్, డాబా గార్డెన్స్ ప్రాంతాల్లో లక్షన్నర పలుకుతున్న గజం ధర