సాంకేతికత చేతులెత్తేస్తే.. స్థానికత సత్తా చాటింది. ఎన్ని టెక్నాలజీలున్నా.. లోకల్ టాలెంట్ ముందు బలాదూర్ అని మరోసారి నిరూపితమైంది. ఆపరేషన్ వశిష్టతో అది నిజమని మరోసారి రుజువైంది.
సాంకేతికత చేతులెత్తేస్తే.. స్థానికత సత్తా చాటింది. ఎన్ని టెక్నాలజీలున్నా.. లోకల్ టాలెంట్ ముందు బలాదూర్ అని మరోసారి నిరూపితమైంది. సోనార్ సిస్టమ్స్, అత్యాధునిక పరికరాలు పనిచేయని చోట.. మానవ శక్తే బలంగా పనిచేసింది. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా కాదన్న దగ్గర ధర్మాడి బృందం చేసి చూపించింది. అదీ లోకల్ టాలెంట్ అంటే. కొన్నిసార్లు పెద్ద పెద్ద యుద్ధట్యాంకులతో పెద్దగా పనికాదు.. బలంగా తగిలే ఒడిశెల రాయి కూడా ప్రభావ వంతంగా టార్గెట్ ఛేదిస్తుంది. సాంకేతికత కన్నా కొన్నిసార్లు సాహసమే ఎక్కువగా పనిచేస్తోంది. ఆత్మవిశ్వాసమే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది. ఆపరేషన్ వశిష్టతో అది నిజమని మరోసారి రుజువైంది.
మూడు వందల అడుగుల లోతులో ఉన్న బోటును బయటికి తీయడానికి ఎదురైన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సుడిగుండాలు, వరద గండాలు, బురద మయమైన గోదావరి గర్భం.. ఎటు చూసిన అగమ్యగోచర పరిస్థితి. ఎన్నో ప్రకృతి వైపరీత్యాల్లో సాహాసోపేతంగా పనిచేసిన ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, నేవీ బృందాలు రంగంలోకి దిగినా.. వశిష్ట బోటును చేరలేకపోయాయి. సరికదా.. సోనార్ సిస్టమ్స్‌తో గాలించినా.. కనీసం బోటు జాడను కూడా సరిగా అంచనా వేయలేకపోయాయి. అప్పుడు ఎంటర్ అయింది లోకల్ టాలెంట్.
టెక్నాలజీ చేతులెత్తేసి పక్కకు తప్పుకుంటే.. ధర్మాడి టీమ్ రూపంలో స్థానిక సత్తా సాధించి తీరుతానంటూ ముందుకు వచ్చింది. గోదావరి మీద పట్టు.. బోటు వెలికితీయడంలో వారికున్న అనుభవంతో ప్రతికూల పరిస్థితుల్లోనే రంగంలోకి దిగింది. ఎన్నో గండాల్ని అలవోకగా కొన్నిసార్లు తప్పించుకుంది. మరికొన్ని సార్లు సమస్యలతో పోరాడింది. బోటు బయటికి తీయడమే లక్ష్యంగా శ్రమించింది. చివరికి టెక్నాలజీ చేయలేని పనిని.. పట్టుదలతో చేసి చూపించింది.
బోటు ఎంత లోతున ఉందో తెలియదు.. ఎక్కడ ఇరుక్కుందో కూడా అవగాహన లేదు. కానీ లోకల్ టీమ్ ధర్మాడి బృందం ఆత్మవిశ్వాసంతో ముందుకు కదిలింది. నేవీ ఆపరేషన్లలో ప్రతిభ కలిగిన అధికారులు సైతం గోదావరి 150 అడుగులకు మించి వెళ్లలేము అని చేతులెత్తేసిన క్రమంలో.. 2వందల అడుగుల లోతున ఉన్న బోటును స్థానిక బృందం ధర్మాడి టీమ్ చేరుకోగలిగింది. సరిగ్గా అంచనా వేసి.. బోటుకు తాళ్లను బిగించగలిగింది. బయటకు లాక్కొని రాగలిగింది.
ఎన్డీఆర్‌ఎఫ్ నుంచి వచ్చిన స్కూబా డైవర్స్ 50 అడుగుల వరకు కూడా వెళ్లలేకపోయారు. కానీ విశాఖ నుంచి వచ్చిన డీప్ సీ డైవర్స్ మాత్రం బోటు ఉన్న ప్రాంతానికి చేరి.. బోటుకు లంగర్లను తగిలించగలిగారు. తాళ్లను బోటుకు బిగించగలిగారు. బోటు అంచనాలోనూ ఎన్డీఆర్‌ఎఫ్ బృందం కంటే స్థానిక మత్య్సకారులు అంచనానే దాదాపు కరెక్టని తేలింది. ఇలా అన్ని సందర్భాల్లోనూ టెక్నాలజీ కన్నా.. స్థానిక సత్తానే అద్భుతమని రుజువైంది.