‘ప్రేమికుల రోజు సంగతి తెలుసిందే! ఈ ప్రేమికుల వారం గొడవేంటి..అనుకుంటున్నారా? ప్రేమికులు వారు ఇష్టపడే వారినీ రోజుకో కొత్త కాన్సెప్ట్ తో దగ్గర చేసే వారం ఈ వాలెంటైన్ వారం… దీని గురించి మరి కాస్త తెలుసుకుందామా!
రోజ్ డే:
వాలంటైన్ వారంలో తొలి రోజు ‘రోజ్ డే’. ఫిబ్రవరి 7వ తేదీన దీన్ని జరుపుకొంటారు. ఇది కేవలం ప్రేమికులకు ఉద్దేశించిన రోజు కాదు. తమకు ఇష్టమైన వారికి ఈ రోజున గులాబీలు ఇస్తారు. ప్రేమికులకు ఎర్ర గులాబీలు, స్నేహితులకు పసుపు పచ్చటి గులాబీలు ఇలా…ఈ రోజు ఇష్టమైన వాళ్ళకు అందించే ఒక్కొక్క రంగు గులాబీ ఒక్కో భావాన్ని వ్యక్తీకరిస్తుంది.
ప్రపోజ్ డే:
ప్రేమిస్తున్న వారికి ఆ విషయాన్ని చెప్పి, ప్రపోజ్ చేసే రోజు. ఫిబ్రవరి 8వ తేదీన దీన్ని పాటిస్తారు. మోకాళ్ళ మీద నిలబడి, ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రేమికులు ప్రపోజ్ చేస్తారు. ఫలితం ఎలా ఉన్నా ప్రయత్నం చెయ్యాలిగా? అలాంటి ప్రయత్నానికి ప్రత్యేకించిన రోజు ఇది.
చాక్లెట్ డే:
పుట్టినరోజులూ, వార్షికోత్సవాలు… ఇలా ఏ సందర్భం వచ్చినా చాక్లెట్లు ఇవ్వడం చాలా పాత ఆనవాయితీ. వాటిని ఇష్టపడనివాళ్ళు దాదాపు ఉండరు. అందుకే మూడోరోజున, అంటే ఫిబ్రవరి తొమ్మిదిన ప్రియమైన వారికి చాక్లెట్లు ఇస్తారు. ఎన్నో ఆకారాల్లో, రకరకాల రుచులతో నోరూరించే చాక్లెట్ల కన్నా మంచి బహుమతి ఏముంటుంది? ‘ప్రపోజ్ డే’ నాడు గుర్తుకురాని, చెప్పడానికి వీలుకాని భావాల్ని వెల్లడించడానికి ఇది మరో ఛాన్స్!
టెడ్డీ డే:
నాలుగో రోజు ఫిబ్రవరి 10న ‘టెడ్డీ డే’. ముందురోజు చాక్లెట్స్ ఇచ్చేశాక, అంతకన్నా ఆకర్షించేది క్యూట్‌గా ఉండే ‘టెడ్డీ బేర్’ కదా! అవతలివాళ్ళ పట్ల మన ఇష్టాన్ని స్పష్టంగా వ్యక్తపరిచే గిఫ్టుల్లో టెడ్డీబేర్ కూడా ఒకటి. ‘టెడ్డీ బేర్ ఇచ్చి చూడండి! మీరు అభిమానించే వాళ్ళ ముఖం ఆనందంతో వెలిగిపోవడం ఖాయం!’
ప్రామిస్ డే:
మీరు ఇష్టపడే వారికి అర్థవంతమైన ప్రామిస్ లు చెయ్యండి. పరస్పర ప్రమాణాలు చేసుకొని, వాటి మీద నిలబడండి. కష్టమైనా ఫరవాలేదు, ఇష్టంగా మార్చుకోండి. ఒక అనుబంధంలో ప్రామిస్ అనేది అత్యుత్తమైన, అతి మధురమైన భావం. నమ్మకాన్ని పెంచేదీ, వ్యక్తిత్వం గురించి చెప్పేదీ అదే. అవతలి వ్యక్తులు తమకు ఉన్నారన్న ధీమాను ఇది కలిగిస్తుంది.
హగ్ డే:
బంధం ఏదైనా కొన్ని సందర్భాల్లో మాటల కన్నా కౌగిలింత ఎక్కువ భావాన్ని వ్యక్తం చెయ్యగలదు. సాన్నిహిత్యాన్ని వెల్లడించగలదు. తల్లితండ్రులు, స్నేహితులు, సోదరులు, పిల్లలు, మీకు ప్రియమైన వ్యక్తులు… ఇలా ఎవరైనా సరే… ఎలాంటి పరిస్థితి ఎదురైనా తమకు వాళ్ళున్నారనే భరోసా ఏర్పడుతుంది.
కిస్ డే:
ప్రేమ వారంలో ఏడో రోజు, వాలెంటైన్ డే ముందు రోజు అయిన ఫిబ్రవరి 13 ‘కిస్ డే’. ముద్దు ప్రేమకి, ఆప్యాయతకు, గౌరవానికి చిహ్నం. ప్రేమకి తియ్యటి వ్యక్తీకరణ ముద్దే మరి! అదే ఈ రోజును కలకాలం గుర్తుండి పోయేలా చేస్తుంది.
ఇలా ఈ వీక్ మోత్తాన్ని వాలంటైన్స్ వీక్‌గా పాటిస్తారు..!