తన భార్యను కాపురానికి పంపించటంలేదనే కోపంతో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. ప్రకాశం జిల్లా పర్చూర్ మండలం అన్నబొట్లవారి పాలెంలో చందు అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. తన భార్యను తీసుకొచ్చి కాపురానికి వస్తానని చెప్పే వరకూ టవర్ దిగేది లేదని తెగేసి చెబుతున్నాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు..స్థానికులు చందూని టవర్ పైనుంచి దించేందుకు యత్నిస్తున్నారు.
గుంటూరుకు చెందిన చందూ అనే యువకుడు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతను అన్నంబొట్లపాలానికి చెందిన విజయలక్ష్మీ అనే యువతిని ప్రేమించాడు.ఇద్దరూ కలిసి పెద్దలకు తెలీకుండా పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా తమ ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఆనాటి నుంచి తన భార్యను తనకు కాకుండా చేస్తున్నారనీ..కనీసం కంటికి కూడా కనిపించకుండా దాచేస్తున్నారనీ చందూ ఆరోపిస్తున్నాడు. తన భార్యను తనతో కాపురానికి పంపించాలనీ..లేదంటే సెల్ టవర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తున్నారు.
కాగా చందూ గతంలో కూడా సెల్ఫీ సూసైడ్ కు యత్నించాడు. ప్రాణాపాయ స్థితి నుంచి బైటపడ్డారు. అయినా తన భార్యను తన దగ్గరకు పంపించకుండా అత్తవారు అడ్డుకుంటున్నారనీ..ఇప్పటికీ అత్తవారు మొండి వైఖరితో తమను ఇద్దరినీ విడదీసేందుకు యత్నిస్తున్నాడని వాపోతున్నాడు చందూ. తన భార్యను తనతో పంపేంత వరకూ టవర్ దిగననీ..తనకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నాడు. లేదంటే టవర్ పైనుంచి దూకేస్తాననీ బెదిరిస్తున్నాడు. దీంతో అన్నభొట్లవారి పాలెంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.