పూజలు చేసుకునే హక్కుకూడా మాకు లేదా? : పోలీసుల పర్మిషన్ తీసుకోవాలా?

  • Publish Date - January 10, 2020 / 05:19 AM IST

మా ఊళ్లో మా గ్రామ దేవతకు పూజలు చేసుకునే హక్కు కూడా మాకు లేదా? తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని ఇప్పుడు సడెన్ గా ప్రభుత్వం అడ్డుకోవటం ఏంటీ? అంటూ అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామ మహిళలు ప్రశ్నిస్తున్నారు. 

మందడంలోని పోలేరమ్మ గుడి వద్ద అమ్మవారికి నైవేయిద్యాలు పెడుతున్న మహిళల్ని పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలో 144 సెక్షన్ అమలులో ఉందని గుడికి ఎవ్వరూ రావద్దనీ..ఇక్కడ ఎటువంటి పూజలు చేయటానికి వీల్లేదంటూ పోలేరమ్మకు ప్రసాదాలు సమర్పిస్తున్న మహిళల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మహిళలు మండిపడుతున్నారు.  
 
సంక్రాంతి రోజుల్లో  అమ్మవార్లను పూజించుకుని పొంగళ్లు వండుకుని నైవేద్యాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తోందని ఇప్పుడు ప్రభుత్వం 144 సెక్షన్ పెట్టి గ్రామంలో ఏదో అరాచాకాలు జరిగిపోతున్నట్లుగా వందలమంది పోలీసులు మోహరించటంపై మందడం గ్రామమహిళలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పోలీసులు అడ్డుకున్నా మేం పూజలు చేసి తీరతామని..మమ్మల్ని కాపాడే మా అమ్మవార్లకు నైవేద్యాలు పెడతామని అడ్డుకున్నవారికి తప్పకుండా అమ్మవారి శాపం తగులుతుందని అంటున్నారు మహిళలు. 

అమ్మవారి గుడికి వెళితే తప్పనే ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదనీ..మా భూములు తీసుకుని మా గ్రామాల్లో కూడా మమ్మల్ని ఉండనివ్వటంలేదు ఇదేమి రాక్షసరాజ్యం అంటూ ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం మా గ్రామదేవతకు పూజలు చేసుకుని ప్రసాదాలు సమర్పించుకుని విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవాలని గ్రామ మహిళలంతా మొక్కుకున్నామని మమ్మల్ని పోలీసులు నిర్భంధిస్తున్నారని వాపోతున్నారు. మేం మా దేవత గుడి వెళుతున్నాం తప్ప కశ్మీర్ కు వెళ్లటంలేదు. 

పాకిస్థాన్ బోర్డర్ కుపోవటంలేదు..మేము తీవ్రవాదులమూ కాదు అటువంటిది మమ్మల్ని పోలీసులు ఇలా వేధించటం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.  
మాగ్రామంలో ఉన్న జనాభా కంటే పోలీసులు ఐదుశాతం ఎక్కువమంది ఉన్నారనీ..మా గ్రామంలో పోలీసులు మోహరించాల్సిన అవసరమేంటని ప్రశ్నిస్తున్నారు. మా ఊళ్లో ఏం జరిగిందనీ..144 సెక్షన్ పెడుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.