ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సిట్టింగ్ ఎమ్మెల్యే డేవిడ్ రాజు తిరిగి సొంతగూటికి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఆయన.. ఆ తర్వాత టీడీపీలోకి జంప్ అయ్యారు. 2019 ఎన్నికల్లో సీటు గ్యారెంటీ అని భావించారు. టీడీపీ టికెట్ ఇవ్వకపోవటంతో.. తిరిగి మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఎస్సీ సామాజిక వర్గం కింద ఆయన 2014 ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేయాలని భావించినా.. చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు.
దీన్ని అవమానంగా భావించిన డేవిడ్ రాజు.. మళ్లీ పాత పార్టీలోకి వచ్చేశారు. మార్చి 26వ తేదీ ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో జగన్ పార్టీలో చేరారు. పార్టీ కోసం ఎస్సీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తానని.. చంద్రబాబు మోసం చేశారంటూ చెప్పుకొచ్చారు. అయితే డేవిడ్ రాజు మాటలు చిత్రంగా ఉన్నాయంటున్నారు నెటిజన్లు. వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి వెళ్లారు.. అప్పుడు జగన్ ను మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నిస్తారు. ఇప్పుడు చంద్రబాబు టికెట్ ఇవ్వలేదని మోసం చేశారు అంటున్నారు.. అప్పుడు మీరు చేసింది ఏంటీ అంటూ చురకలు అంటిస్తున్నారు నెటిజన్లు.