ఇసుక మాఫియాపై ఎమ్మెల్యే కోటం రెడ్డి ఆగ్రహం

  • Publish Date - October 25, 2019 / 11:07 AM IST

నెల్లూరు జిల్లాలో ఇసుక మాఫియాపై వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్ లైన్ లో ఇసుక కోసం అప్లై చేసుకునేందుకు యత్నిస్తుంటే ‘నో స్టాక్’ అని రావటంతో ఆయన ఫైర్ అయ్యారు.  నెల్లూరు రూరల్ పొట్టేపాడు ఇసుక రీచుల్లో మాఫియా రెచ్చిపోతోందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇసుక విషయంలో సీఎం జగన్ పారదర్శకత తీసుకొచ్చారనీ కానీ అధికారుల నిర్లక్ష్యంతో మాఫియాదారులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్నారు. 

ప్రజలకు ఇసుక అందించే విధంగా.. ఇసుకాసురుల ఆట కట్టించేలా సీఎం జగన్ కఠిన చర్యలు తీసుకున్నా కొంతమంది స్వార్థ పరులు ఇసుకను అక్రమంగా తరలిస్తు తమ జేబులు నింపుకుంటున్నారనీ ఆరోపించారు. అధికారుల అలసత్వంతో ఇటువంటి పరిస్థితి వచ్చిందన్నారు. కొంతమంది స్వార్థ పరులు వల్లా..అధికారుల నిర్లక్ష్యంతో సీఎం జగన్ ఆశయాలను, ఆకాంక్షల్ని పూర్తిగా అమలు కావడం లేదన్నారు. దీనికి అధికార యంత్రాంగ బాధ్యత వహించాలన్నారు.

ఒక్క నిమిషానికే ఇసుకకు నో స్టాక్ బోర్డు పెట్టి.. పక్క రాష్ట్రాలకు ఇసుక తరలి పోతుంటే అధికార యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు. అవసరమైతే స్థానిక ఎమ్మెల్యేగా ఇసుక మాఫీయాపై ప్రత్యక్ష పోరాటానికి దిగుతానని కోటం రెట్టి తెలిపారు.