జగన్ ప్రభుత్వం నిర్వాకం : ‘కియ’ తరలింపు అందుకే : గల్లా జయదేవ్

  • Publish Date - February 6, 2020 / 06:48 AM IST

అనంతపురం జిల్లాలోని ‘కియా’ ప్లాంట్ తమిళనాడుకి తరలుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో ప్రచురితమైన కథనం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై టీడీపీ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పరిశ్రమ స్థాపించిన కొన్ని నెలలకే ఎదురవుతున్న సవాళ్లు, సమస్యల దృష్ట్యా 1.1బిలియన్ డాలర్ల తమ ప్లాంట్‌ను తరలించాలని ‘కియ’ నిర్ణయించుకుందని గల్లా తెలిపారు. భవిష్యత్ పెట్టుబడులకు ఇది ప్రతికూలంగా మారనుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే తరాల ఉపాధి అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపనుందని గల్లా ట్వీట్‌ చేశారు.

అంతర్జాతీయ వార్తాసంస్థ ప్రచురించిన ఈ కథనం అవాస్తవమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ..సదరు సంస్థ ఇప్పటివరకూ అధికారికంగా ఖండించకపోవటం గమనించాల్సిన విషయం. అలాగే సీఎం జగన్ కూడా దీనిపై స్పందించకపోవటంపై మరిన్ని అనుమానాలు..ఆందోళనలు వ్యక్తమవతున్నాయి. ఈ వార్తలు చర్చనీయాంశంగా మారటంతో వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పారిశ్రామిక రాయితీలపై…పునరాలోచన చేయటమే తరలింపునకు కారణమంటూ రాయిటర్స్ కథనం పేర్కొనడంతో.. వైసీపీ ప్రభుత్వ హయాంలో మరో పరిశ్రమ తరలిపోతోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి.