కుటుంబసభ్యులనే పట్టించుకోలేదు.. ఇక ప్రజలను ఏం చూసుకుంటారు

  • Publish Date - April 7, 2019 / 10:18 AM IST

హైదరాబాద్ : జూనియర్ ఎన్టీఆర్ మామ, వైసీపీ నేత నార్నె శ్రీనివాసరావు.. ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబు ఏనాడూ సొంత కుటుంబసభ్యులను పట్టించుకోలేదన్నారు. అలాంటి వ్యక్తి ఇక ప్రజలను ఎలా చూసుకుంటారో ఆలోచించాలని ఓటర్లను కోరారు. హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు విఫలం అయ్యారని నార్నె మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారని, ముఖ్యమంత్రి అయ్యాక వాటిని మర్చిపోయారని మండిపడ్డారు. చంద్రబాబు సొంత బలంతో ఏ రోజూ ఎన్నికల్లో గెలవలేదన్నారు. పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వచ్చారని విమర్శించారు. చంద్రబాబుపై విమర్శలు చేసిన నార్నె.. వైసీపీ చీఫ్ జగన్ పై ప్రశంసలు కురిపించారు. జగన్ మాట తప్పని నాయకుడు అని కితాబిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ జగన్ నెరవేరుస్తారని నార్నె శ్రీనివాసరావు చెప్పారు.

నార్నె శ్రీనివాసరావు.. ఇటీవలే వైసీపీలో చేరారు. చంద్రబాబుతో ఆయనకు బంధుత్వం ఉంది. అలాంటి వ్యక్తి వైసీపీలో చేరడం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. చాలాకాలంగా తనకు వైఎస్ జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నార్నె ఇదివరకే చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నానని, దీని కోసం తనవంతు సహాయ, సహకారాలను అందించడానికే తాను పార్టీలో చేరానని నార్నె శ్రీనివాసరావు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.