జహీరాబాద్ లో మహిళపై జరిగిన అత్యాచారం కేసులో మొత్తం ముగ్గురు నిందితుల్లో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు సోమాచారి పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతుండగా రాయగోడు మండలం తిరూర్ సమీపంలో కారు బోల్తా పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
జహీరాబాద్ లో మహిళపై జరిగిన అత్యాచారం కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో అత్యాచారానికి పాల్పడిన నిందితులకు సంబంధించి దారుణమైన విషయాలు బైటపడుతున్నాయి. ఈ ఘాతుకానాకి పాల్పడిన పవన్ కుమార్, సోమాచారి, బ్రహ్మాచారి ముగ్గురు వరంగల్ జిల్లాకు చెందినవారిగా తేలింది. వీరిలో సోమాచారి, బ్రహ్మాచారిలిద్దరు అన్నదమ్ములు. బ్రహ్మాచారిపై హత్య, దోపిడీలాంటి మొత్తం 32 కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. బ్రహ్మాచారి వరంగల్, సూర్యాపేట, కోదాడ హైవేలపై దారికాసి దోచుకునేవాడు. దీంట్లో భాగంగానే ఓ హత్య కేసుకూడా ఇతనిపై నమోదైఉంది. గతంలో బ్రహ్మాచారి జైలుశిక్ష కూడా అనుభవించాడు.
కాగా..తనపై అత్యాచారం జరిగిందని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. దీంతో గురువారం (ఫిబ్రవరి 12,2020)న ఈ క్రమంలో మెదక్ జిల్లా మహాబత్కూర్ సమీపంలో సీఐ కృష్ణ నిందితులు ఉన్నట్లుగా గుర్తించారు. పోలీసులు తమకు గుర్తించారని గమనించిన నిందుతులు కారులో పరారయ్యేందుకు యత్నించారు.
కానీ సీఐ కృష్ణ వారిని తన వాహనంలో వెంబడించారు. పోలీసులకు తప్పించుకునేందుకు నిందితులు తమ కారును అతి వేగంగా పోనిచ్చారు. ఈ క్రమంలో వారి కారు యాక్సిడెంట్ కు గురైంది. ఈ ప్రమాదంలో సోమాచారి అక్కడిక్కడే మృతి చెందగా..మరో ఇద్దరు నిందితులు బ్రహ్మాచారి..పవన్ కుమార్ లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సీఐ కృష్ణ తన సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిని ఇద్దరినీ హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయించారు. సోమాచారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు.
కాగా..సూర్యాపేట జిల్లా కోదాడ మండలానికి చెందిన 32 ఏళ్ల మహిళ తన 12 ఏళ్ల కుమారుడితో కలిసి కర్ణాటకలోని బీదర్ నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్ లో హైదరాబాద్ కు లగేజ్ తో పాటు బయలుదేరింది.ఈ క్రమంలో ఆ బస్సులోనే ఉన్న ఇద్దరు వ్యక్తులు మీరు తీసుకెళ్లే లగేజ్ లో నిషేధిత ఉత్పత్తులు ఉన్నాయని..మేము పోలీసులం మీ లగేజ్ ను తనిఖీలు చేయాలంటూ సదరు మహిళను బెదిరించి జహీరాబాద్ చౌరస్తావద్ద బస్సునుంచి ఆమెతోపాటు కుమారుడ్ని కూడా కిందికి దింపేశారు.
తరువాత ఆమెను అక్కడకు సమీపంలో ఉన్న ఓ బ్యాంక్ వద్దకు తీసుకెళ్లి లగేజ్ చెక్ చేశారు. దాంట్లో గుట్కా ప్యాకెట్లు ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో ఆమెతో విడిగా మాట్లాడలని చెప్పి ఆమె కుమారుడ్ని లగేజ్ వద్ద ఓ వ్యక్తి ఉంచి మరో వ్యక్తి ఆమెను బ్యాంక్ వెనుకకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత రెండో వ్యక్తికూడా అత్యాచారం చేశాడు. తరువాత ఇద్దరూ పరారయ్యారు.
దీంతో దిక్కుతోచని ఆమె ఆ రాత్రి అంతా బ్యాంక్ వద్దే ఉండిపోయింది. తెల్లవారింది. ఉదయం బ్యాంక్ వద్దే కుమారుడితో కలిసి కూర్చున్న ఆమెను స్థానికులు గమనించారు. ఏంటమ్మా నువ్వు ఎవరు? ఈ సమయంలో ఇక్కడున్నావేంటి? అన్ని ప్రశ్నించారు. దీంతో జరిగిన విషయం అంతా చెప్పింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించటంతో బాధితురాలు జహీరాబాద్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేయటం..వారి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన క్రమంలో సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా నిందితులును పట్టుకోవటం..వారి నుంచి తప్పించుకునేందుకు జరిగిన క్రమంలో ఓ నిందితుడు చనిపోవటం వంటిది జరిగింది.
కాగా ఈ కేసులో మరో కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బస్సులో వస్తున్న మహిళ లగేజ్ లో గుట్కా ప్యాకెట్లు ఉన్నట్లుగా నిందితులకు ఎలా తెలిసింది? ఆమె నిజంగానే గుట్కా అక్రమ రవాణా చేస్తోందా? సదరు నిందితులకు..బాధితురాలికి గతంలో ఏమన్నా సంబంధాలున్నాయా? అందుకే వారు బస్ దిగమని అనగానే బస్సు దిగిపోయిందా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.