కొత్త రూల్ : ఉ.10 నుంచి రా.9 గంటల వరకు మద్యం షాపులు.. మూడుకు మించి మద్యం బాటిళ్లు ఉంటే చర్యలు

విడతల వారీగా మద్య పానం నిషేధమే లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వమే మద్యం షాపులు

  • Publish Date - August 31, 2019 / 02:06 PM IST

విడతల వారీగా మద్య పానం నిషేధమే లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వమే మద్యం షాపులు

విడతల వారీగా సంపూర్ణ మద్య పానం నిషేధమే లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించనుంది. ఏపీ ఎక్సైజ్ శాఖ నూతన నిబంధనలు తీసుకొచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి ఏపీలో 500లకుపైగా ప్రభుత్వ మద్యం దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి మద్యం షాపు దగ్గర ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ పర్యవేక్షణ ఉంటుంది. సర్కారీ మద్యం షాపుల దగ్గర పర్మిట్ రూమ్ లు ఉండవు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంటాయి. రోడ్డుపై మద్యం సేవిస్తే శిక్షిస్తామని ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఎమ్మార్పీ రేట్లకే మద్యం విక్రయించాలని ఆదేశించారు. ఏ వ్యక్తి దగ్గరైనా మూడుకు మించి మద్యం బాటిళ్లు ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు.

సంపూర్ణ మద్యపాన నిషేధం సీఎం జగన్ ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఒకటి. అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ముందు బెల్ట్ షాపులకు చెక్ పెడతారు. ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించాలని నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వ దుకాణాల ద్వారా మద్యం అమ్మకాలు చేస్తారు. 500 లిక్కర్ షాపుల్లో అమ్మకాలు ఆదివారం(సెప్టెంబర్ 1, 2019) నుంచి ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ స్వామి తెలిపారు. సీఎం జగన్ ప్రకటించిన ‘నవరత్నాల్లో’ మద్యం అమ్మకాలపై నిషేధం ఒకటి అన్నారు. ఒక వ్యక్తి దగ్గర ఆరు మద్యం బాటిళ్లు ఉండొచ్చన్న నిబంధన రద్దు చేశారు. కొత్త పాలసీ ప్రకారం ఒక వ్యక్తి దగ్గర 3 లిక్కర్ బాటిళ్లకు మించి ఉండకూడదు.

మద్యపానం వల్ల కలిగే నష్టాల గురించి హెచ్చరించే బోర్డులను లిక్కర్ షాపుల్లో ఏర్పాటు చేస్తారు. కొత్త పాలసీ ప్రకారం ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యం షాపులు నిర్వహిస్తుంది. 2018లో 4వేల 377 మద్యం షాపులు ఉండగా.. ఆ సంఖ్య 3వేల500కి తగ్గింది. అక్టోబర్‌ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3వేల మద్యం దుకాణాలు సర్కార్ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు.