ఆపరేషన్‌ రాయల్‌ వశిష్ట-2 : 40 అడుగుల లోతులో బోటు

  • Publish Date - October 19, 2019 / 05:17 AM IST

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద ఆపరేషన్‌ రాయల్‌ వశిష్ట చేపట్టిన ధర్మాడి టీమ్‌ అందరిలో ఆశలు రేకెత్తిస్తోంది. మూడ్రోజులపాటు సాగిన బోటు వెలికితీత పనుల్లో పురోగతి కనిపించడంతో…  శనివారం (అక్టోబర్19, 2019) కూడా బోటు వెలికితీసేందుకు ప్రయత్నించబోతోంది. ఇవాళ కూడా పాత పద్ధతినే ఫాలో కాబోతోంది. ప్లాన్‌ ఏ, బీలను మిక్స్‌ చేసి బోటును బయటకు లాగేందుకు ప్రయత్నించనుంది ధర్మాడి బృందం. అయితే బోటు నెలరోజులకు పైగా నీటిలో నానిపోయింది. ఈ క్రమంలో యాంకర్‌కు తగిలినప్పటికీ… శకలాలు తప్ప పూర్తిస్థాయిలో బోటు రావడం కష్టమేనని తెలుస్తోంది.

నెల రోజుల క్రితం గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట పున్నమి బోటును వెలికితీసేందుకు ధర్మాడి సత్యం బృందం విశ్వ ప్రయత్నం చేస్తోంది. నిన్న ఉదయం పోర్టు అధికారి కెప్టెన్‌ ఆదినారాయణ ఆధ్వర్యంలో బోటును వెలికితీసేందుకు యాంకర్‌; ఐరన్‌ రోప్‌ను ఉచ్చు మాదిరిగా గోదావరిలోకి వదిలి పొక్లెయిన్‌ సాయంతో లాగారు. అయితే, యాంకర్‌ తగులుకుని పట్టు జారిపోయింది. నిన్న సాయంత్రం మరోసారి యాంకర్‌ను నీటిలోకి వదిలి ఐరన్‌ రోప్‌ను రెండుసార్లు బోటు చుట్టూ గోదావరిలోకి విడిచిపెట్టారు. అదే సమయంలో వర్షం కురవడంతో వెలికితీసే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడింది. ఇవాళ మరోసారి బోటును వెలికితీసేందుకు ప్రయత్నించనున్నారు.

రెండ్రోజుల పాటు చేపట్టిన ఆపరేషన్‌లో పలుమార్లు యాంకర్‌, ఐరన్‌ రోప్‌ బోటుకు తగులుకోవడంతో… పట్టు జారినప్పటికీ నదీగర్భం నుంచి సుమారు 70 అడుగుల మేర ఒడ్డు వైపుకు బోటు జరిగినట్లు పోర్టు అధికారి తెలిపారు. యాంకర్, రోప్‌ లాగుతున్న సమయంలో బోటు ఉన్న ప్రాంతంలో బుడగలతో కూడిన డీజిల్‌ ఆనవాళ్లు కనిపిస్తున్నాయని… దుర్వాసన వస్తోందని చెప్పారు. బోటులో ఉన్న డిస్పోజబుల్‌ గ్లాసుల కట్ట పైకి తేలింది. ప్రస్తుతం బోటు 40 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. 

నది ఒడ్డు నుంచి సుమారు 250 అడుగుల దూరంలో బోటు ఉన్నట్లు నిర్ధారించారు. మరో పది మీటర్లు ఒడ్డువైపు చేర్చగలిగితే బోటును సులభంగా వెలికితీయవచ్చని చెప్తున్నారు. యాంకర్‌ వేసిన ప్రతిసారీ బోటు ఇంచుమించు పది నుంచి ఇరవై మీటర్ల మేర ముందుకు వస్తోందన్నారు. బోటు ఆపరేషన్‌లో జాప్యం జరుగుతోంది తప్ప… దాన్ని వెలికితీయడం ఖాయమని ధర్మాడి సత్యం చెప్పారు. బోటుకు యాంకర్‌ తగిలించేందుకు విశాఖకు చెందిన అండర్‌ వాటర్‌ సర్వీస్‌ బృందాన్ని ధర్మాడి సత్యం బృందం సంప్రదించగా… నదిలో దిగేందుకు ఆ బృందం విముఖత వ్యక్తం చేసింది. నీరు బురదగా ఉండటంతో అడుగు భాగానికి వెళ్లి యాంకర్‌ తగిలించేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు.

మరోవైపు ఇప్పటివరకు బోటును వెలికి తీసేందుకు సంప్రదాయ పద్దతిలో పొక్లెయిన్‌తో పాటు ఐరన్ రోప్‌ వాడిన ధర్మాడి టీమ్… అధికారులు అనుమతిస్తే గజ ఈతగాళ్ల సాయం తీసుకోవాలని యోచిస్తోంది. గజ ఈతగాళ్లను సిలిండర్ల ద్వారా నది లోపలికి పంపించి…. బోటుకు యాంకర్ తగిలించాలని భావిస్తోంది. సెకండ్‌ ఫేజ్‌లో చేసిన ప్రయత్నాలు కొంత సత్ఫలితాలను ఇవ్వడంతో… ధర్మాడి సత్యం బృందంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి బోటును బయటకు తీసుకొస్తామనే ధీమాతో ఉంది.