తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరి నదిలో మునిగిన బోటు వెలికితీత ప్రయత్నాలకు ధర్మాడి టీమ్ రెడీ అవుతోంది. ఐరన్ రోప్, యాంకర్‌తో చేసిన ప్రయత్నాలు
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరులో ఆపరేషన్ రాయల్ వశిష్ట 5వ రోజుకు చేరింది. ఆదివారం(అక్టోబర్ 20,2019) విశాఖకు చెందిన డీప్ సీ డైవర్స్ రంగంలోకి దిగారు. నిన్న విశాఖ వెళ్లిన ధర్మాడి సత్యం… 10 మంది దుబాసీలను తీసుకొచ్చారు. వీరంతా నదీ గర్భంలోకి వెళ్లి బోటుకు రోప్ బిగిస్తే… సులభంగా బయటకు తీసే అవకాశముంటుంది. అయితే దేవీపట్నం చేరుకున్న దుబాసీలను… కచ్చులూరుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దుబాసీలతో ఆపరేషన్ నిర్వహించడానికి పోలీసులు ఒప్పుకోలేదు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి వస్తేనే పంపిస్తామని నిలువరించారు. దీంతో ఆగ్రహించిన ధర్మాడి సత్యం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము బోటును వెలికితీసేందుకు ప్రయత్నిస్తుంటే… స్థానిక అధికారులు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఉన్నతాధికారులతో మాట్లాడిన పోలీసులు… సీ డైవర్స్‌తో ఆపరేషన్ నిర్వహించేందుకు అనుమతించారు.
బోటును బయటకు తీసేందుకు ధర్మాడి సత్యం బృందం నాలుగో రోజు కూడా విఫలయత్నం చేసింది. బోటు ఆచూకీ గుర్తించి 4 రోజులు గడిచిపోగా… గురు, శుక్రవారాల్లో బోటును ఒడ్డు వైపుకు 70 అడుగుల మేర చేర్చారు. నిన్న మూడుసార్లు వృత్తాకారంలో ఐరన్ రోప్‌ను బోటు ఉన్న ప్రాంతంలో నదిలోకి విడిచిపెట్టి ఉచ్చు మాదిరిగా బిగించి బయటకు లాగే ప్రయత్నం చేశారు. అయితే ఖాళీ రోప్ మాత్రమే బయటకు వచ్చింది. బోటు ఉన్న ప్రాంతంలో నదీగర్భం V ఆకారంలో ఉండటంతో బోటు బయటకు రావడం కష్టంగా మారింది. రోప్‌తో లంగర్ వేసినప్పటికీ బోటుకు సరిగా తగలకపోవడంతో జారిపోతోంది.
నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడుసార్లు తాళ్లు, లంగర్లు వేసి పొక్లెయిన్ సాయంతో లాగినప్పటికీ… బోటు అడుగుభాగం నుంచి తాళ్ల పైకి తేలిపోవడంతో పురోగతి కనిపించలేదు. దీందో ధర్మాడి సత్యం విశాఖ వెళ్లి… సీ డైవర్స్‌ను తీసుకొచ్చారు. సీ డైవర్స్ నది అడుగు భాగానికి వెళ్లి బోటుకు తాళ్లు చుడితే సులభంగా వెలికి తీయవచ్చని భావిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం బోటు 38 అడుగుల లోతులో… ఒడ్డుకు సుమారు 190 అడుగుల దూరంలో ఉందని ఆపరేషన్‌కు నాయకత్వం వహిస్తున్న పోర్టు అధికారి కెప్టెన్ ఆదినారాయణ చెప్పారు. కనీసం బోటు 60 అడుగులు ముందుకు వచ్చి ఉంటే బయటకు తీయడం సులభంగా ఉండేదని చెప్పారు. నిన్న మధ్యాహ్నం బోటుకు వేసిన తాళ్లను లాగుతున్న క్రమంలో దానిని గుర్తించిన ప్రాంతంలో… అంతకముందు వేసిన రెండు లంగర్లు ఈ తాడుకు తగిలి పైకి వచ్చేశాయి. దీంతో పది నిమిషాల పాటు గందరగోళం ఏర్పడింది. మళ్లీ తిరిగి గుర్తించేవరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు నిన్న గాలింపు చర్యల్లో ఓ లైఫ్‌ట్యూబ్ దొరికింది. ఇది వాహనాల టైరుకు ఉండే ట్యూబ్ లాంటిది. లైఫ్ జాకెట్ మాదిరిగా ప్రమాద సమయంలో ఈ లైఫ్ ట్యూబ్‌ను పట్టుకుని ప్రాణాలతో బయటపడవచ్చు. ఇవి బోటుకు కూడా తగిలించి ఉంటాయి. బోటుతో పాటు నదిలో ఉండిపోయిన ఈ లైఫ్‌ట్యూబ్ గాలింపు చర్యల్లో దొరికడంతో… దాన్ని ఒడ్డుకు చేర్చారు. మరోవైపు ప్రమాదంలో గల్లంతైన వారిలో 38 మంది మృతదేహాలు మాత్రమే లభ్యం కాగా… మరో 13 మంది ఆచూకీ తెలియకపోవడంతో వారి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.