చిత్తూరు : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జనసేన వస్తే ప్రజలకు ఏం చేస్తుందో చెబుతున్నారు. అదే సమయంలో
చిత్తూరు : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. జనసేన వస్తే ప్రజలకు ఏం చేస్తుందో చెబుతున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. తిరుపతి తారకరామ మైదానంలో బీఎస్పీ చీఫ్ మాయవతితో కలిసి పవన్ ఎన్నికల యుద్ధభేరి సభ నిర్వహించారు. టీడీపీ, వైసీపీలపై పవన్ ఫైర్ అయ్యారు. ఇంకా ఎన్నాళ్లు చంద్రబాబు, జగన్ పల్లకీలు మోస్తారని ప్రశ్నించారు. దళితులు ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు.
దళితులకు జగన్, వైసీపీ నేత కరుణాకర్ రెడ్డి విలువ ఇవ్వరు అని పవన్ అన్నారు. వారి ఇళ్ల మధ్య దళితులు నడిచి వెళ్లాలంటే చెప్పులు చేత్తో పట్టుకుని వెళ్లాల్సిన దుస్థితి ఉందన్నారు. వైసీపీ లాంటి పార్టీలకు బుద్ధి చెబితేనే దళితులకు న్యాయం జరుగుతుందన్నారు. ఆంధ్రులను ఛీ కొట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్ ఎలా కలుస్తారు? అని పవన్ ప్రశ్నించారు. తిరుమల ఏడుకొండల వెంకటేశ్వరుడికే కరుణాకర్ రెడ్డి విలువ ఇవ్వలేదన్నారు. కరుణాకర్ రెడ్డి టీడీపీ ఛైర్మన్ గా ఉన్నప్పుడు శ్రీవారి నగలు ఎక్కడికి పోయాయో తెలియదన్నారు. తిరుమలలో జగన్ ప్రోటోకాల్ పాటించరని, చెప్పులు వేసుకుని వెళ్తారని పవన్ విమర్శించారు. జగన్ తాను ఓ మహాత్ముడినని అనుకుంటారని, జగన్ అహంకారం దిగాలి అని పవన్ చెప్పారు. తనకు ఊడిగం చెయ్యాలని జగన్ అనుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ ఎన్నికల్లో బీసీలను అభ్యర్థులుగా నిలబెట్టిన ఘనత జనసేనది అని పవన్ చెప్పారు. దళితులను వాడుకుని వదిలేసే వైసీపీకి బుద్ధి చెప్పాలని పవన్ పిలుపునిచ్చారు. ఏ పార్టీ నాయకుడైనా జన సైనికులపై దాడి చేస్తే అంతు చూస్తామని పవన్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీకి పాచిపోయిన లడ్డూలంటేనే ఇష్టమన్నారు. ఏపీకి బీజేపీ చేసిన మోసాన్ని మర్చిపోము అని పవన్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి పోరాడతానని మాయావతి హామీ ఇచ్చారని పవన్ చెప్పారు. తిరుపతిలో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ అల్లుడు దందాలు, కరుణాకర్ రెడ్డి రౌడీయిజం అణిచివేస్తామన్నారు. టీడీపీ వస్తే కబ్జాలు పెరిగిపోతాయన్నారు. అన్ని పార్టీలు దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేస్తున్నాయని పవన్ మండిపడ్డారు. ఐదేళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చని బీజేపీ నేతలు.. ఇప్పుడు కొత్త హామీలతో ముందుకొస్తున్నారని పవన్ విమర్శించారు.